విద్యార్థి దశ నుంచే భగవద్గీతను చదివి అర్థం చేసుకుంటేనే భారతీయ ధర్మం నిలబడుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ అరవిందరావు అన్నారు. మంగళవారం రామకృష్ణ మఠంలో భగవద్గీత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గీతా జయంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ ధర్మం గొప్పదనం తెలుసుకోలేకనే యువత ఇతర వ్యామోహంలో కొట్టుకుపోతోందని వాపోయారు. గీత పరమాత్ముడు స్వయంగా చెప్పిన పరమార్థ సత్యమని పేర్కొన్నారు. ఏ రూపంలో కొలిచినా ఆమోదిస్తానని పరమాత్ముడు చెప్పినందు వల్లనే భారతీయులు వారికి నచ్చిన రూపంలో దేవీదేవతలను ఆరాధిస్తున్నారని వివరించారు. నా మతమే గొప్పది.. ఆచరించకపోతే నరకానికి పోతారు..నా మతాన్ని నమ్మని వారిని దండిస్తామనే విధానం హిందూ ధర్మంలో ఎక్కడా కనిపించదన్నారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతీయ ఔన్నత్యం కలకాలం నిలవాలంటే గీత సారాన్ని విశ్వవ్యాప్తం చేయాలని సూచించారు. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగాధరశాస్త్రి మాట్లాడుతూ ఇంటింటిలో భగవద్గీత ఉండాలని, రోజుకో శ్లోకం తాత్పర్యంతో నేర్చుకోవాలని సూచించారు. వయసు ఉడిగిన తర్వాత చదివేది గీత కాదని బాల్యం నుంచే ఔపోసనపట్ట దగిన గ్రంథం గీత అని స్పష్టం చేశారు. నెదర్లాండ్ దేశంలో విద్యార్ధి దశ నుంచే గీతను బోధిస్తున్నారని, అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయం ఎంబీఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా నేర్పుతున్నారని వెల్లడించారు. ఆంగ్లంలో రూపొందిస్తున్న సంగీత భగవద్గీత గ్రంథం త్వరలో పూర్తి చేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతుల మీదుగా విడుదల చేయించబోతున్నామని చెప్పారు. ఆంగ్ల భగవద్గీత పోస్టర్ను అతిథులు విడుదల చేశారు. ఓగేటి కృపాల్కు గీతాచార్య, కల్యాణరామస్వరూప్కు పార్థ పురస్కారాలను ప్రదానం చేశారు. అంతకుముందు విఖ్యాత కూచిపూడి నాట్యగురువు డా.శోభానాయుడు కూచిపూడి సంప్రదాయంలో శ్రీకృష్ణ నృత్యాంజలి సమర్పించారు. కార్యక్రమంలో రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద, ఐ పోకస్ అధినేత వాసుదేవశర్మ, ఆర్వీఎస్ అవధాని, ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయరామ్ తదితరులు పాల్గొన్నారు.