పేదవాడి గుండె చప్పుడు వంగపండు ప్రసాదరావుకు ప్రగాఢ సంతాపం in Visakhapatnam,Vizagvision…పేదవాడి గుండె చప్పుడు వంగపండు ప్రసాదరావు అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రముఖ జానపద గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి సందర్భంగా విఎంఆర్డిఎలో సాంస్కృతిక శాఖ తరఫున ఏర్పాటు చేసిన సంతాప సభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగపండు ప్రసాదరావు తన జీవితాంతం బడుగు, బలహీన వర్గాల జీవితాలలో జానపద గేయాలతో చైతన్యం తీసుకువచ్చారన్నారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని, జానపద చరిత్ర ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. ముఖ్యమంత్రి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తన తరఫున మంత్రి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆయన తెలియజేశారు. వంగపండు ప్రసాదరావు పేరు విశాఖలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రభుత్వం తరఫున తగిన చర్యలకు కృషిచేస్తాని చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. ఆచార్య చందూ సుబ్బారావు మాట్లాడుతూ జీవితం విజయవంతంగా కొనసాగించారని తెలుపుతూ వంగపండు మృతికి తన సంతాపాన్ని తెలిపారు. కె.కె.రాజు వంగపండు మృతికి తనసంతాపాన్ని తెలుపుతూ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. సిపిఐ నాయకులు సత్యనారాయణ, నర్శింగరావులు, , తదితరులు మాట్లాడుతూ వంగపండు ప్రసాదరావు గొప్ప వాగ్గేయ కారుడని ఆయన మరణం తీరని లోటని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి వంగపండు చిత్రపటానికి మంత్రి, తదితరులు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాయకులు దేవిశ్రీ వంగపండు ఇక లేరు అనే గేయాన్నిఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు వి.వి.రమణమూర్తి విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిశోర్, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు వి. మణిరాం, పర్యాటక అధికారి పూర్ణిమాదేవి, ఉత్తరాంధ్ర కళాకారుల సంఘం కార్యదర్శి వి. మారుతి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.