భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు, కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ ఆర్ అండ్ అర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన. కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు అభిజిత్ ముఖర్జీ అధికారికంగా వెల్లడించారు.
ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ప్రముఖుల సంతాపం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) మరణం దేశానికి తీరని లోటని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రార్థించారు.
‘‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంతో ఓ శకం ముగిసిపోయింది. దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది. ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనది. ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’
– రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
‘‘భారత్రత్న ప్రణబ్ ముఖర్జీ మరణ వార్త విని దేశం మొత్తం విలపిస్తోంది. దేశ అభివృద్ధి పథంలో నడిపించడంలో ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయనో గొప్ప రాజనీతిజ్ఞుడు. అటు రాజకీయ వర్గాల్లోనే కాక, సామాన్యుల నుంచి సైతం మెప్పు పొందిన గొప్ప వ్యక్తి’’
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి
‘‘రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం నన్ను కలచివేసింది. దేశం ఓ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. ఎంతో శ్రమ, పట్టుదల, క్రమశిక్షణతో దేశ రాజ్యాంగ అత్యున్నత పదవిని చేపట్టారు. ప్రజా సేవలో భాగంగా ఆయన చేపట్టిన అన్ని పదవులకూ వన్నె తెచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’
-వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి
‘‘ప్రణబ్ ముఖర్జీ మాతృభూమికి ఎనలేని సేవలు అందించారు. ప్రణబ్ మృతితో దేశం పెద్ద రాజకీయ నేతను కోల్పోయింది’’
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
‘‘ప్రణబ్‌జీ మరణవార్తతో దేశం మొత్తం దుఖః సాగరంలో మునిగిపోయింది. యావత్ దేశంతో పాటు నేను కూడా ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా’’
-రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
‘‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉంది. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి ప్రణబ్ నాయకత్వం వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు. ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. యాదాద్రి దేవాలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారు. వ్యక్తిగతంగా తన తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్‌కు నివాళులు అర్పిస్తున్నా.’’
-కె. చంద్రశేఖర్‌రావు, తెలంగాణ ముఖ్యమంత్రి
‘‘ప్రణబ్ ముఖర్జీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించారు. క్లిష్ట సమస్యల పరిష్కారంలో ప్రణబ్ పరిణతి ప్రదర్శించారు. రాజకీయ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లారు.’’
– వైఎస్. జగన్, ఏపీ ముఖ్యమంత్రి
‘‘కాకలు తీరిన రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలిని దేశం కోల్పోయింది. ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి లోటు. 60 ఏళ్ల రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ వివాదరహితుడు. ప్రణబ్ నిరాడంబరత, నిబద్ధత, నిజాయతీ అందరికీ ఆదర్శం’’
-చంద్రబాబు, తెదేపా అధినేత