ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత వెంకయ్య నాయుడు శనివారం తొలిసారిగా సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. ఆయన పర్యటన సందర్భంగా ప్ర్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా స్వాగత సత్కారాలు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు లక్షమందితో భారీ మానవహారం ఏర్పాటు చేయనున్నారు. భారీ రోడ్ షో ఉన్నందున ఆ మార్గంలో వాహనాల రాకపోకలు మళ్లించనున్నారు. ఉపరాష్ట్రపతి పౌర సన్మానానికి సంబంధించి గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వెలగపూడి వద్ద భారీ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు విద్యార్ధులు, మహిళలు, మానవహారంగా ఏర్పడి ఉపరాష్ట్రపతికి పూలతో స్వాగతం పలుకుతారు. దాదాపు 23 కిలోమీటర్ల మేర లక్షమందితో మానవహారంగా ఏర్పడనున్నారు. పాఠశాలలు, కళాశాలల నుంచి 70 వేల మంది విద్యార్థులు, మరో 30 వేల మందిని డ్వాక్రా సంఘాల నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. దారిపొడవునా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పూలతో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం వద్ద ప్రత్యేక స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. భారీ ర్యాలీ దృష్ట్యా వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన.. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి సహా బెంజి సర్కిల్, బందర్ రోడ్డు మీదుగా ప్రకాశం బ్యారేజీ వరకు కొనసాగనుంది. ర్యాలీ ముగిసే వరకు ఆ మార్గంలో ఇతర వాహనాలను అనుమతించేది లేదని పోలీసులు స్పష్టంచేశారు. ప్రజలకు వాహనదారులకు మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను ఉదయం 6 గంటల నుంచి ర్యాలీ ముగిసే వరకు వివిధ జిల్లాల పరిధిలో మళ్లించనున్నారు.
వాహనాల మళ్లింపు వివరాలు..
విశాఖపట్నం వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు
* దేవరపల్లి , సత్తుపల్లి, తల్లాడ , ఖమ్మం , సూర్యాపేట, మీదుగా..
* హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు , విస్సన్నపేట, కల్లూరు, వైరా , ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు..
* హనుమాన్ జంక్షన్ , నూజివీడు, మైలవరం, ఇబ్రహీం పట్నం మీదుగా హైదరాబాద్‌కు..
హైదరాబాద్ వైపు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు
* హైదారాబాద్ – సూర్యాపేట- ఖమ్మం- తల్లాడ- సత్తుపల్లి- దేవరపల్లి- మీదుగా మళ్లింపు..
* హైదరాబాద్ – సూర్యాపేట- ఖమ్మం- వైరా- కల్లూరు- విస్సన్నపేట- నూజివీడు- హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లింపు
* విశాఖపట్నం వైపు నుంచి చెన్నైకు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ – గుడివాడ- పామర్రు- చల్లపల్లి- అవనిగడ్డ- బాపట్ల- ఒంగోలు- మీదుగా మళ్లింపు
* చెన్నై వైపు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ఒంగోలు – త్రోవగుంట- బాపట్ల- అవనిగడ్డ- చల్లపల్లి- పామర్రు- గుడివాడ- మీదుగా మళ్లింపు
* హైదరాబాద్ నుంచి చెన్నై కు వెళ్లే వాహనాలు నార్కెట్ పల్లి- నల్గొండ- మిర్యాలగూడ- పిడుగురాళ్ల- అద్దంకి- మేదర మెట్ల- ఒంగోలు మీదుగా మళ్లింపు
* చెన్నై వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు -ఒంగోలు – మేదర మెట్ల- అద్దంకి- పిడుగురాళ్ల-మిర్యాలగూడ- నల్గొండ- నార్కట్ పల్లి మీదుగా మళ్లింపు
* గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు – సత్తెనపల్లి – పిడుగురాళ్ల – మిర్యాలగూడ- నార్కట్ పల్లి మీదుగా మళ్లింపు
* హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లే వాహనాలు – నార్కట్ పల్లి – మిర్యాలగూడ – పిడుగు రాళ్ల- సత్తెన పల్లి – మీదుగా మళ్లింపు
* మచిలీ పట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు మచిలీపట్నం – పామర్రు- చల్లపల్లి – అవనిగడ్డ – బాపట్ల- ఒంగోలు మీదుగా మళ్లింపు
* చెన్నై నుంచి మచిలీ పట్నం కు వెళ్లే వాహనాలను మచిలీపట్నం -పామర్రు- హనుమాన్ జంక్షన్- నూజివీడు – విస్సన్నపేట – కల్లూరు- వైరా – ఖమ్మం – సూర్యాపేట మీదుగా మళ్లింపు
* హైదరాబాద్ నుంచి మచిలీ పట్నం వెళ్లే వాహనాలు హైదరాబాద్ – సూర్యాపేట- ఖమ్మం- వైరా – కల్లూరు- విస్సన్నపేట- నూజివీడు – హనుమాన్ జంక్షన్ – పామర్రు మీదుగా మళ్లింపు
గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు విజ్ఞప్తి
ట్రాపిక్ మళ్లింపు దృష్ట్యా వాహనదారులు , ప్రజలు తదనుగుణంగా ప్రయాణ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. శనివారం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు వాహనాల మళ్లింపును దృష్టిలో ఉంచుకుని గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.