ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ చలసాని రాఘవేంద్ర రావు 2021-22 ఆర్ధిక సంవత్సరాంతానికి మొత్తం ఆర్ధిక కార్యకలాపాలు రూ.7,558 కోట్లకు చేరుకొనుటకు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు.
ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 106వ వార్షిక మహాజన సభ శనివారం న మద్దిలపాలెం “కాకతీయ కల్చరల్ అసోసియేషన్ కన్వెన్షన్ సెంటర్”లో బ్యాంకు ఛైర్మన్ శ్రీ చలసాని రాఘవేంద్రరావు గారి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు మాట్లాడుతూ
ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు విశాఖపట్నంలో 1916 ఫిబ్రవరి 5వ తేదిన కార్యకలాపాలు ప్రారంభించి, నేటికి 105 సంవత్సరాలు పూర్తి చేసుకొని 106వ సంవత్సరంలో పయనిస్తున్నదని, బ్యాంకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలో 46 శాఖలు మరియు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో 4 శాఖలు కలిగి మొత్తం 50 శాఖలతో 25 ఎ.టి.యం. లతో బహుళరాష్ట్రాల సహకార అర్బన్ బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని తెలిపారు.
2021 మార్చి 31 నాటికి రూ.3,853.58 కోట్లు డిపాజిట్లు, రూ.2,719.43 రోట్లు ఋణాలతో మొత్తం బ్యాంకు ఆర్థిక కార్యకలాపాలు రూ. 6,573.01 కోట్లకు చేరుకున్నవని తెలిపారు. బ్యాంకు 2021 మార్చి 31 నాటికి 90,776 మంది సభ్యులు, రూ. 251.40 కోట్లు పేరుధనంతో దక్షిణ భారతదేశంలో అతి పెద్ద సహకార బ్యాంకుగా స్థానం పొందినది. బ్యాంకు యొక్క నిరర్ధక ఆస్తులు (NPA) 2021 మార్చి 31 నాటికి మొత్తం ఋణాలలో 1.65% గా ఉన్నయని తెలిపారు.
బ్యాంకు 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ. 45.11 కోట్ల నికర లాభం ఆర్జించినదని,నికర లాభము నుండి చట్టబద్ధమైన రిజర్వులకు కేటాయింపులు జరిపిన పిదప సభ్యులు షేరుధనంపై 10% అనగా రూ.23.89 కోట్లు డివిడెంట్ గా చెల్లించుటకుగాను మహాజనసభ ఏకగ్రీవంగా ఆమోదించినదని ఆయన తెలిపారు.
ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న నక్కవానిపాలెం బ్రాంచి భవనము ఇటీవల కొనుగోలు చేయడం ద్వారా బ్యాంకునకు స్వంత భవనమును సమకూర్చుకోవడ మైనదని, దీనితో కలిపి బ్యాంకు ప్రధాన కార్యాలయము మరియు 13 బ్రాంచిలకు మొత్తం 14 స్వంత భవనములు కలిగి ఉన్నదని తెలియజేశారు. కోవిడ్-19 కరోనా వైరస్ కారణంగా రెండు దశలలోనూ బ్యాంకు సిబ్బంది పెద్ద సంఖ్యలో అనారోగ్యానికి గురి అయినా కూడా బ్యాంకు సభ్యులకు, ఖాతాదారులకు బ్రాంచీలలో ఎటువంటి అసౌకర్యము కలుగకుండా పాలకవర్గం, సిబ్బంది సమన్వయంతో నిరాటంకముగా సేవలు అందించారని పేర్కొన్నారు.
బ్యాంకు ఎమిరిటస్ చైర్మన్ మానం ఆంజనేయులు మాట్లాడుతూ పేదలు, దిగువ మధ్యతరగతి వారిని అదుకొనేలా బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించిన్నపుడే నిజమైన సహకార స్ఫూర్తి నెరవేరినట్లు అవుతుందని అన్నారు. బ్యాంక్ లాభాల బాటలో నడవడంతో పాటు వాటా దారులకు ఆ ఫలాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా సంక్షోభ నేపథ్యంలో ప్రైవేటు టీచర్లు, ఆటో డ్రైవర్లు లాంటి చిన్న రంగాల్లో పనిచేస్తున్న వారు చితికిపోయారని, వారికి చేయూత అందించేందుకు బ్యాంక్ మరింత శ్రద్ధ చూపాలన్నారు. ఈ నేపధ్యంలో అటువంటి వారి దగ్గరకు వెళ్లి ఋణాలు అందించేలా చర్యలు చేపడుతూ వారితో మమేకం కావాలని సూచించారు. బ్యాంకులకు డిపాజిట్లు మెండుగా వస్తున్నపటికి వాటిని లోనింగ్ లో పెట్టలేకపోతే ఆ సంస్థ నష్టాల్లోకి వెళ్లినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. డిపాజిట్లు సేకరణ, రుణాల మంజూరు మధ్య సమతుల్యతను పాటించాలన్నారు. దేశంలోని జాతీయ బ్యాంకుల్లో 53 శాతం కార్పొరేట్ రంగాలవారికే రుణాల రూపంలో సహాయం దక్కుతోందని ఈ విధానం బ్యాంకుల జాతీయకరణ స్ఫూర్తికి విఘాతమన్నారు. ఈ సందర్భంగా 38 మంది కార్పొరేట్ రంగాలకు చెందినవారు 2 లక్షల కోట్ల రూపాయల ప్రజాసొమ్మును లూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పరిధిలోని 90 వేల మంది సభ్యుల ఆలోచనలు ప్రతిబింబించేలా విధి విధానాలను రూపొందించుకోవాలని అన్నారు. ప్రజల కోసం నడిపితేనే నిజమైన కోఆపరేటివ్ బ్యాంక్ గా గుర్తింపు లభిస్తుందని అన్నారు.
మహాజనసభలో బ్యాంకు సీనియర్ వైస్-ఛైర్మన్ గుడివాడ భాస్కరరావు, వైస్ ఛైర్మన్ ముదివర్తి రాఘవరావు, డైరెక్టర్లు సూర్పనేని నాగభూషణ చౌదరి,ఎ.జె. స్టాలిన్, నామన కామరాజు, శ్రీమతి కాకి భవాని,రావు వెంకట జగ్గారావు,వీరఘంట చంద్రశేఖర్, గుళ్ళపల్లి జనార్ధనరావు, శ్రీమతి తెన్నేటి పద్మావతి, డా॥ చెలికాని రామారావు,చెరువు ఆదినారాయణ శాస్త్రి , శిరువూరి జానకి రామచంద్ర రాజు,పొట్లూరి వెంకట రమణరావు,కండాపు ప్రసాదరావు, శ్రీమతి ఉప్పలపాటి పార్వతీదేవి, జామిశెట్టి వెంకట సత్యనారాయణ మూర్తి, శ్రీ చిన్నం కోటేశ్వరరావు,పాల్యం నారాయణ స్వామి, కో-ఆప్టెడ్ డైరెక్టర్లు దండమూడి బాబూరావు, డా॥ రామమూర్తి వైధ్యనాధన్ , ముఖ్య కార్యనిర్వహణాధికారి పి. వెంకట నరసింహమూర్తి , జనరల్ మేనేజర్ ఎ.వి. రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ మహాజనసభలో వివిధ బ్రాంచిల నుండి ప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు పాల్గొన్నారు. 44 మంది ప్రతినిధులు మహాజనసభలో మాట్లాడుతూ బ్యాంకు వార్షిక నివేదికపైన, పనితీరు పైన పలు సూచనలు సలహాలు అందించారు.