విశాఖపట్నం అన్నార్తులకు చారిటీ బాక్సు అండగా నిలిచింది. నిరాశ్రయులకు మేమున్నామంటూ ముందుకు వచ్చింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై కనికరం చూపించింది. నెలవారీ కార్యక్రమంలో భాగంగా చారిటీ బాక్సు ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పెదవాల్తేరులోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో నిత్యావసరాలతో కూడిన ప్యాకెట్స్ అందజేశారు. అక్కడ నుంచి బీచ్‌రోడ్డు, సిరిపురం, ఆర్టీసీ కాంప్లెక్సు, మద్దిలపాలెం, తాటిచెట్లపాలెం, ఆరిలోవ, మల్కాపురం తదితర ప్రాంతాల్లో ఎంపిక చేసిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని నిరాశ్రయులకు మాస్కులు కూడా అందజేశారు. నిత్యావసరాల్లో కందిపప్పు, గోధుమ పిండి, పంచదార, బంగాళా దుంపలు, ఉల్లిపాయలు, సబ్బులు ఉన్నాయి.
ఈ సందర్భంగా చారిటీ బాక్సు సభ్యులు దౌలూరి శంకరరావు, వురిటి శ్రీనివాసరావు మాట్లాడుతూ చారిటీ బాక్సు అనేది ఒక సేవా సంస్థ అన్నారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టేందుకే ఈ గ్రూపు ఏర్పాటైందన్నారు. సర్వమత సమానత్వమే గ్రూపు అభిమతమన్నారు. ఈ గ్రూపులో విభిన్న వర్గాల వారు ఉండటం విశేషమని పేర్కొన్నారు. గ్రూపులోని సభ్యుల స్పందన అద్వితీయమన్నారు. సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించడం ముదావహం అన్నారు. చారిటీ బాక్సు తరుపున సేవా కార్యక్రమాలు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు కొవ్వూరులో కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గ్రూపు సభ్యులు కొప్పుల భాస్కరరావు ఆధ్వర్యంలో అమలాపురంలో ప్రతి నెల ఒక మంగళవారం అన్నదానం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేదమాత శ్రీ గాయత్రి పీఠం అధిపతి సాయిశర్మ, మహమద్ హలీం బాష, లక్కోజు నూకరాజు తదితరులు పాల్గొన్నారు.