విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి శనివారం సాంప్రదాయబద్ధంగా అంకురార్పణ జరిగింది. అమ్మవారి చదురుగుడి వద్ద ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ, దేవస్థాన అనువంశిక చైర్మన్, కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తరుపున వారి కుమార్తె ఆదితి గజపతిరాజు, ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరమణ పందిరి రాట వేశారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని వనం గుడి దగ్గరా పందిరి రాట తంతు నిర్వహించారు. అక్టోబరు 2న తోలేళ్ల ఉత్సవం, 3న సిరిమాను ఉత్సవం జరగనుంది. డెంకాడ మండలం రెడ్డికపేటలోని బట్టు బంగారమ్మ, పెంటయ్యరెడ్డి పొలంలోని చెట్టును ఈసారి సిరిమానుగా మలచనున్నారు.