– ఇంటి వద్దే వివిధ బిల్లుల స్వీకరణ
– దాదాపు డజను చెల్లింపులకు అవకాశం
– ప్రతీ గ్రామానికి దగ్గరయ్యేలా చర్యలు
– 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా సేవలు
– మార్చి నుంచే అందుబాటులోకి ఐపీపీబీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సమాచార టెక్నాలజీ విప్లవంలో మరుగున పడిపోతున్న భారత తపాలా శాఖ తిరిగి పూర్వవైభవం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు గాను తమకు అందివచ్చిన ‘ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్’ (ఐపీపీబీ) అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుంచి భారత తపాలా శాఖ ఐపీపీబీ సేవలను మొదలు పెట్టనుంది.
అయితే గతంలో అనుకున్న విధంగా దేశంలోని అన్ని పోస్టాఫీసులను బ్యాంకులుగా మార్చి సేవలను అందించాలన్న ఆలోచనతో పాటు.. తపాలా శాఖను ప్రజలకు మరింత చేరువచేసేందుకు అందుబాటులోఉన్న అన్ని ఇతర అవకాశాలను పరిశీలిస్తోంది.
ఇంటి వద్దే అన్ని రకాల ఆర్థిక సేవలు..
పేమెంట్ బ్యాంకు సేవాలను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్న భారత తపాలా శాఖ తమ విస్తరణలో భాగంగా డిపాజిట్ల కంటే కూడా చెల్లింపులపై ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తోంది. పోస్టల్ శాఖకు కీలకంగా నిలిచే పోస్ట్మెన్ల సేవలను ఇందుకు గరిష్టంగా వినియోగించుకొనేలా ప్రణాళికను రూపొందించుకుంటోంది. తమ ప్రణాళికలో భాగంగా దేశంలోని దాదాపు 1.50 లక్షల మంది పోస్ట్మెన్లకు బుల్లి మైక్రో ఏటీఎం లాంటి పరికరాన్ని అందించనుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ప్రింటర్‌తో పాటు వెలిముద్రలను గుర్తించేలా ఈ ఎలక్ట్రానిక పరికరాన్ని తపాల శాఖ తయారు చేయిస్తోంది. ఈ పరికరంతో పోస్ట్మెన్లు ఇంటి వద్దకే వచ్చి ప్రజల నుంచి విద్యుత్తు బిల్లులు, నళ్లా బిల్లులు, మొబైల్ రిచార్జ్, డీటీహెచ్, స్కూలు ఫీజులు, బ్యాంకు చెల్లింపులు, నెలవారీ కిస్తీల చెల్లింపులతో పాటు దాదాపు డజనుకు పైగా చెల్లింపులను స్వీకరించేలా ప్రణాళికలను తయారు చేసింది. దీనికి తోడు ప్రభుత్వ అందించే వివిధ రకాల సంక్షేమ పథకాల సొమ్ములను కూడా పోస్ట్‌మెన్ ద్వారానే ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు ఇప్పించేలా సన్నాహాలు చేస్తోంది.
35 కోట్ల ఖాతాలతో ముందుకు..
భారత తపాలా శాఖ ఇప్పటికి దేశా వ్యాప్తంగా దాదాపు 35 కోట్ల ఖాతాలను కలిగి ఉంది. రానున్న అయిదేండ్ల కాలంలో దాదాపు మరో 8 కోట్ల కుటుంబాల వారికి భారత తాపాలా శాఖ పేమెంట్ బ్యాంకు సేవలను విస్తరించాలని ఐపీపీబీ అధికారులు చెబుతున్నారు.
నగదు వాడకాన్ని తగ్గించి డిజిటల్ కరెన్సీ లావాదేవీలను ప్రోత్సాహించాలని భావిస్తున్న సర్కారు లక్ష్యాన్ని గ్రామాలకు తీసుకుపోయేందుకు తమ సేవలు ఎంతగానో దోహదం చేస్తాయని.. గ్రామీణుల నగదు చెల్లింపులు.. బ్యాంకు అవసరాలను కూడా తాము గరిష్టంగా తీర్చగమన్న విశ్వాసాన్ని తపాలా శాఖ వ్యక్తం చేస్తోంది. తమ ప్రణాళిక అనుకున్న ప్రకారం అమలైతే కేవలం కొన్ని సంవత్సరాల్లోనే భారత తపాలకు పూర్వవైభవం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ శాఖ అధికారులు చెబుతున్నారు.
గ్రామలకూ డిజిటల్ బూస్ట్
భారత తపాలా శాఖ దేశ వ్యాప్తంగా 1.5 లక్షల పోస్టాఫీసులతో దేశంలో మూలమూలన విస్తరించి ఉంది. బ్యాంకింగ్ సేవలు ఎక్కువగా అందుబాటులో లేని ప్రాంతాల్లో సైతం తపాలా శాఖ బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇదే అంశాన్ని తమకు అనువుగా మార్చుకోవాలని భారత పోస్టల్ శాఖ యోచిస్తోంది. చాలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బ్యాంకింగ్ సేవలను పొందాలంటే దాదాపు 10-25 కి.మీ. మేర ప్రయాణం చేయాల్సి పరిస్థితి ఉంది. ఏటీఎం కేంద్రాలు కూడా అందరికీ అందుబాటులో లేవు. ఈ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ప్రజా సేవయే ధ్యేయంగా ఎదగాలని తపాలా శాఖ భావిస్తోంది. దీంతో మైక్రో ఏటీఎం ద్వారా చెల్లింపులతో పాటు గ్రామీణులకు పోస్ట్మెన్లు ఏటీఎంల మాదిరిగానే చిన్న మొత్తంలో నగదును అందించేలా యాప్‌ను రూపొందిస్తోంది. ఇందుకోసం ఐటీ దిగ్గజ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. పోస్ట్మెన్ను టెక్నాలజీని అందించడం ద్వారా తమకున్న నెట్‌వర్క్‌తో తిరిగి పూర్వవైభవం సాధించవచ్చన్నది తపాలా శాఖ ప్లాన్. ఈ ప్రణాళికలో భాగంగా తపాలా శాఖ దాదాపు 2 లక్షల మైక్రో ఏటీఎంల కొనుగోలుకు గాను త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది. వీటికి బ్యాక్ఎండ్ ఇంటిగ్రేటర్‌గా హెచ్‌పీ సంస్థను భారత తపాలా శాఖ ఇప్పటికే ఎంపిక చేసుకుంది