భయపడిందే జరిగింది. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా, వరుణుడు అడ్డంపడినా… రక్తం చిందడం ఆగలేదు.
కర్నూలు జిల్లా దేవరగట్టులో మరోసారి తలలు పగిలాయి.
బన్నీ ఉత్సవంలో వేలాదిమంది కర్రలతో కొట్టుకున్నారు.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా సుమారు 70 మంది తీవ్రంగా గాయపడ్డారు.
యధావిధిగా విజయదశమి రాత్రి దేవరగట్టు రక్తసిక్తమైంది.
కొందరి తలలకు గాయాలు అయ్యాయి. మరికొంతమంది చేతులు విరిగాయి.
గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
మాలమల్లేశ్వర స్వామిని దర్శించుకోడానికి 13 గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు.
హింసకు తావు లేకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అక్కడి ప్రజలు సంప్రదాయాలకే పెద్ద పీట వేశారు.
ఎంతమంది కౌన్సిలింగ్ ఇచ్చినా, ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా తమ కర్రల సమరం తమదే అంటూ కొట్టుకున్నారు.
13 గ్రామాల ప్రజలు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
స్వామిని దక్కించుకోవాలన్న లక్ష్యంతో కర్రలతో దాడి చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కనే ఉన్న కర్నాటక నుంచి కూడా దేవరగట్టుకు చేరుకున్నారు.
దాదాపు రెండు లక్షల మంది వచ్చారు. పోలీసులు కూడా కర్రల సమరాన్ని ఆపడానికి కృషి చేశారు.
కర్రలను దేవరగట్టుకు తీసుకువెళ్లకుండా, మద్యం సరఫరా లేకుండా ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
దేవరగట్టు గ్రామాన్ని డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు.
ఎన్నిచర్యలు తీసుకున్నా కర్రల యుద్ధం మాత్రం ఆగలేదు