సామాజిక స్పృహకు నిలువుటద్దం – జాషువా


“ఇచ్చోట నేసత్కవీంద్రుని కమ్మని
కలము, నిప్పులలోనఁ గఱఁగిపోయె
యిచ్చోట నేభూములేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె
యిచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు గంగలోఁ గలసిపోయె
యిచ్చోట నెట్టిపే రెన్నికం గనుఁగొన్న
చిత్రలేఖకుని కుంచియె నశించె
ఇది పిశాచులతో నిటలేక్షణుండు
గజ్జె గదలించి యాడు రంగస్థలంబు
ఇది సరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ
నవనిఁ బాలించు భస్మసింహాసనంబు” …!
అనే పై పద్యం చదివినపుడు ఈ నేలలో ఎందరో రాజులు,చక్రవర్తుల అధికారం అంతమొందింది.రాజర్షులు, మహర్షులు తపోనిష్టలో గతించిపోయారు.
చిత్రకారులు,కళాకారులు, సాహితీకారులు పుట్టిన నేల ఇది.ఈ మట్టిలో ఎంత రక్తపాతం ఇంకిందో,ఇంకెందరి స్ర్తీల మెడల తాళి కరగిందో కదా..!
జీవితానికి అద్దం పడుతూ.. స్మసాన భూమిని ఉదహరిస్తూ.. వ్రాసిన పద్యమైనప్పటికీ ఆ నిటాలేక్షణుడు గజ్జె కదలించి ఆడేఆటలో మనుషులందరూ పాత్రదారులమేనన్న సత్యం అవగతంకాక మానదు.
భస్మ సింహాసనంపై కూర్చుని పరమశివుడు ఆడే ఆటే ఈ జీవితం. అందులో మానవులమైన మనం పడే యాతనలను చాలా చక్కగా అనుభవైక వేద్యంగా వివరించగలిగిన శక్తి జాషువాగారికి ఎలా వచ్చిందంటారు?
కేవల ఏకాంతాలలో ఊహలలో నుండి వెలువడిన రచనమాత్రం ముమ్మాటికీ కాదు,కానేరదు అని వారు బాల్యంలో పడిన ఇక్కట్లనుండి తెలుసుకోవచ్చు.
తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవులు,తల్లి మాదిగ,తండ్రి పాస్టర్ గా పనిచేస్తూ వచ్చిన దానితో నెట్టుకొచ్చేవారు.ఈ ఒక్క విషయం చాలును కదా.! మూఢాచారాలతో నిండిన ఆనాటి సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోవడానికి.
బాల్యం అంతా ఆటపాటలతో గడచినప్పటికీ చదువుకునే రోజుల్లో ధనికులకూ బడుగు, బలహీన వర్గాలకూ మధ్య నాటి పరిస్థితుల్లో దాగిన తారతమ్యతల ఘటనలు జాషువాగారికి అనుభవైకవేద్యమైనాయి.
ఆ పరిస్థితులకు తలొగ్గిన సౌమ్య స్వభావికాదు వీరు.ప్రశ్నించేతత్వం కలిగినవ్యక్తి కనుక తిరగబడి ఆ పరిస్థితులకు ఎదురునిలిచేవారు.
కాళిదాసుని మేఘదూతమును పోలిన కావ్యమును జాషువాగారు రచించారు.అయితే ఈయన మేఘమును వార్తాహరునిగా ఎన్నుకొనక పగలు కానరాక చీకటిలో తిరుగాడే గబ్బిలమును వార్తాహరునిగా ఎంచుకుని ఒకింత తన చీకటి జీవితమునకు ఊరట కల్పించుటకోసమని తనమాటగా భగవంతునికి విన్నవించుమని..
ఆలయంబున నీవు వ్రేలాడువేళ
శివుని చెవి నీకు కొంత చేరువుగ నుండు
మౌని ఖగరాజ్ఞి పూజారి లేనివేళ
విన్నవింపుము నాదు జీవితచరిత్ర..అంటారు.
ఆలయంలో తను వేలాడేటప్పుడు (గబ్బిలం తలక్రిందులుగావేలాడుతుంది.అంటే కఠోరమైన తపస్సుచేస్తున్నదన్నమాట. అదిమౌనంగాకూడ ఉంటుంది. ఖగరాజ్ఞి అని పొగుడుతున్నాడు.తనకి దూత కదా. కొంచెం పొగడాలి.) శివుడి చెవిలో (వేలాడుతుంది కనుక మనకంటే తనకి దగ్గరగా శివుడి చెవి ఉంటుందని చమత్కారం) పూజారి లేని వేళలో చెప్పమంటున్నాడు తన బాధని. ఎందుకంటే, దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడని సామెత. అంటే, దేముడు ఒక వేళ మొర ఆలకిద్దామనుకున్నా, పూజారి విననీయడని భావం పలికిస్తూ ఆతనిపై పడిన ఈ సామాజిక కట్టుబాట్ల అడ్డుగోడల మర్మమేమిటనేదానిని భూతదయ గల పరమేశ్వరునికి విన్నవించి సమాధానము తెలుపవలసినదిగా కోరుకున్నారు.
కమ్ముకున్న చీకట్లను పారద్రోలగ సాహితీమతల్లిని నమ్ముకుని రచనలు చేస్తున్న సమయంలో అనేక సందర్భాలలో సమాజంచే గుండెలు పగిలేలా అవమానించినా నిలదొక్కుకున్నారు.వారికి భుజంతడుతూ వెన్నంటి నిలచిన స్నేహితులు దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు సహచర్యంలో కవిత్వం పై మక్కువ పెరిగితే జూపూడి హనుమచ్ఛాస్త్రిగారు వద్ద నేర్చుకున్న కుమార సంభవం, మేఘసందేశం, రఘువంశం రచనల కారణంగా మొత్తం 36 గ్రంధాలు మరెన్నో కవితా ఖండికలువ్రాసారు.
నా కథలో రచనలో వారి వెన్నుతడుతూ…
కవీ! కుల భేద శాకినుల్ మెదలెడు దేశ మిద్ది నిను మెచ్చదు, మెచ్చిన మెచ్చకున్న శారద నిను మెచ్చె, మానకుము ప్రాప్తకవిత్వ పరిశ్రమంబులన్” (నా కథ)- అంటూ జాషువాగారి భుజం తట్టి కందుకూరి వీరేశలింగం పంతులుగారు అన్న మాటలు జాషువాగారికి ఆదర్శాలయ్యాయి.
జాషువా ఛీత్కారాలు ఎదురైనచోటునే సత్కారాలను పొందారు.వడగాల్పు నా జీవితమైతే-వెన్నెల నా కవిత్వం అంటూ చెప్పుకొచ్చారు. జాషువాగారు సాహితీ రచనలో ఎదుర్కొన్న అవమానాలకు ధీటుగా వారి సాహిత్యాభిలాషను తెలుపుతూ…
గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయ చేత నన్నెవ్విధి దూరినన్ నను వరించిన శారద లేచిపోవునే.? అంటారు.
వారి రచనల్లో విశేషంగా చెప్పుకోదగిన రచన గిజిగాడు.
“కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి
డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగ, గన్నెగాడ్పు లూ
యెల సదనంబు నూచ, భయమింత యెరుంగక కన్నుమూయు, నీ
యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా! యొక ఱేని కున్నదా?”
(అర్థం)
నీ భార్య, నీ పిల్లలు నీవు అల్లుకున్న గూట్లో నీ ఒళ్ళో నిర్భయంగా, హాయిగా పడుకుంటే పకృతి జోల పాడుతూ ఉంటుంది. ఇంత గొప్ప సుఖం మనుషులకు దక్కుతుందా? అన్ని సంపదలు, అంతులేని అధికారం ఉన్న ఒక రాజుకయినా దక్కుతుందా? అని అంటారు. అంతే కాకుండా
“అందమున నీకు నీడగు నందగాడు
గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు
వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు
లేఁడురా గిజిగా! మొనగాఁడ వోయి!” అనే పద్యంలో
అందంలో నీకు సాటి రాగలవారు; ఇల్లు కట్టుకోవడంలో నీతో పోటీపడగలవారు; వైభవంలో నీతో సమానంగా తూగగల ఇంద్రుడు లేరుని అంటారు.
“నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ
మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో
యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా
వాగెడు నాస్తికు ల్తలలు వంతు రనంతుని చెంత ఖిన్నులై” అనే పద్యంలో గిజిగాడు అన్న పేరులోనే నీ తెలివిని తెలిపే గూడు దాగి ఉంది. నీ రెక్కల ఈకల అందానికి మానవకోటి మైమరచిపోతూ ఉంటుంది. నీ ప్రతిభను చూసిన తరువాత దేవుడి సృష్టి ఇంత గొప్పదా? అని నాస్తికులు కూడా తలవంచుకుని…పొగుడుతారు!
బహుశః సమస్త తెలుగు సాహిత్యంలో పక్షి గూడు మీద జాషువాగారు చెప్పినంత అందంగా, అద్భుతంగా, తాత్వికంగా, కవితాత్మకంగా ఇంకెవరూ చెప్పి ఉండకపోవచ్చు. ఒకవేళ చెప్పినా అవన్నీ జాషువా తరువాతే కావచ్చు అనడంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు.
గాలిలో ఊగే చిటారు కొమ్మకు పక్షి గడ్డి పోచలతో గూడు కట్టడం దానికదిగా ఒక అద్భుతం. అందం. ఆశ్చర్యం. లోపలికి వెళ్లి రావడానికి సరిపోయేంత సందు ఉంచి తన చుట్టూ తానే గాలిలో గూడు కట్టుకునే పక్షిని చూస్తే నిజంగానే సృష్టిలో ఎన్నెన్ని అద్భుతాలు అందాలుగా మన కళ్ల ముందు పరచుకుంటున్నాయో అని ఆశ్చర్యపోవాలి. ఒక్కొక్క గడ్డిపోచను ముక్కున పట్టుకొని వచ్చి, జారిపోకుండా ఒక మగ్గం మీద పడుగు పేకల్లా నేతగాడు వస్త్రం నేసినట్లు పక్షి గూటి గోడలు కట్టే నైపుణ్యాన్ని చూడని కళ్లు కళ్లే కాదు. ఆ నైపుణ్యాన్ని మెచ్చుకోని మనసు మనసే కాదు.ఆ మనసు జాషువాలో ఉంది అందుకనే ఇంతటి అద్భుతకావ్యరాజం వెలువడిందనడంలో అతిశయోక్తిలేదు.
ఇలా సాహితీ జగత్తులో అడుగిడి తనదైన శైలిని ముఖ్యంగా జీవితంలో కవిత్వాన్ని చూపించిన మహనీయులు వీరే.అడుగడుగునా ఎదురైన ఆటుపోట్లను అన్నింటినీ అక్షరీకరిస్తూ తన తరపున తన రచనలనే మాట్లాడింపచేస్తూ ఈసడించిన సమాజం చేతనే వహ్వా అని జేజేలు పలికింపచేసుకుంటూ..వెలుగురేఖలవైపుగా ప్రసరించిన కవివరేణ్యులు జాషువా..
కాలమేదైనా సమాజ చైతన్యం అత్యవసరమైనపుడు ఎదురుతిరికగి కావాల్సినవి సాధించుకోవాలి అన్నపుడు ,జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు ఎదురైనపుడు తలచుకోవలసిన పేరు జాషువా.
ఎక్కడో ఛీత్కారాల మాటున మొదలైన బాల్యాన్ని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుల వరకు, తన పుస్తకాలు భావితరాలకి పాఠ్యాంశాలయ్యే స్థాయి వరకు ఎదిగిన వారి ఎదుగుదల ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమే,ఆదర్శనీయమే.
కనుకనే “సుకవి జీవించు యుండు ప్రజల నాల్కలయందు” అని అన్న జాషువా గారు మాటలు అక్షర సత్యమే కానీ జాషువాగారు ప్రజల నాలుకలపైనే కాదు హృదిలో కూడా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుకే ఓ సుమధుర కవీ! అందుకో మా ఈ వినమ్ర వందనం.
యాళ్ళ ఉమామహేశ్వరి
తెలుగు అధ్యాపకురాలు
విశాఖపట్టణం.7032216995