రాష్ట్రంలో ఇకపై సీజనల్ వ్యాధులు కనిపించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ప్రజారోగ్యం విషయంలో నిర్ల్యక్ష్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని ఆయన చెప్పారు. ‘పేషెంట్ ఫస్ట్’ అనే విధానాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అలవరచుకోవాలని అన్నారు. గురువారం రాత్రి విజయవాడ క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
అన్ని రకాల వైద్య పరీక్షలకు అవసరమైన ల్యాబొరేటరీలను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుబాటులో వున్న వైద్యులను, సహాయ సిబ్బందిని సమర్ధంగా వినియోగించుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలడానికి ముఖ్య కారణమైన దోమల్ని నియంత్రించాల్సిందేనని అధికారులకు స్పష్టంచేసిన ముఖ్యమంత్రి, 21 లక్షల దోమతెరలను పది రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందించాలని ఆదేశించారు. దీనిపై పరిష్కార వేదిక నుంచి అవసరమైన ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని నిర్దేశించారు. ‘సీజనల్ వ్యాధులు ఎప్పుడొస్తాయనేది ప్రతి ఏడాది తెలిసిన విషయమే. ఆ సీజన్‌కు ముందే తగిన ప్రణాళికలు తయారు చేసుకోవడం ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా మారాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. సీజనల్ వ్యాధుల గత చరిత్ర దగ్గర పెట్టుకుని అవి ఎప్పుడు వస్తాయో స్పష్టంగా తెలుసుకుని ముందు నుంచే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై గిరిజనుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఐటీడీఏ పరిధిలోని గ్రామాలలో ప్రజారోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, రహదారుల సమస్యలు ఇంకా కనిపిస్తున్నాయని, ఆయా ప్రాంతాలకు సమయానికి చేరుకోలేకపోవడమే అతిపెద్ద సమస్యగా ఉన్నదని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు నిపుణులైన వైద్యులు సుముఖత వ్యక్తం చేయడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అవసరమైతే ప్రభుత్వం ఈ విషయంలో విధాన నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. గిరిజన ప్రాంతాలలో వేగంగా వైద్య సేవలు అందించేందుకు బైక్ అంబులెన్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కచ్చితంగా 24 గంటలు పనిచేయాలని చెప్పారు.