‘ఇంటింటికీ తెలుగుదేశం’ పాటలు విడుదల
* సీడీని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
‘ఇంటింటికీ తెలుగుదేశం’ పాటలను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 8 పాటలతో రూపొందించిన సీడీని సోమవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సెప్టెంబర్ 11న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు 60 లక్షల కుటుంబాలను తెలుగుదేశం పార్టీ నేతలు పలకరించారని వివరించారు. 40 లక్షలకు పైగా కుటుంబాలకు జియో ట్యాగింగ్ చేశామని చెప్పారు. ‘ఇంటింటికీ తెలుగుదేశం’లో సుమారు 21 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, అందులో గృహ నిర్మాణానికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. పేదల ఖర్చు తగ్గించేందుకు విద్యా, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజల సంతోషమే కొలమానంగా పరిపాలన సాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు సంతృప్తి చెందేలా అధికారుల పనితీరు మెరుగవుతోందని, ప్రజాప్రతినిధుల బాధ్యత మరింత పెరుగుతోందని వివరించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో 80 శాతం సంతృప్తి ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశామన్నారు.