విశాఖ ఆర్చ్‌బిషప్‌గా ఉడుమల బాలను ప్రతిష్టాపించిన పోప్ ప్రతినిధి Visakhapatnam Vizagvision
“ఐక్యత, అభివృద్ధి, సామరస్యంతో ఉత్తమ వైజాగ్, ఉత్తమ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నదే నా అజెండా”: ఆర్చ్‌బిషప్ బాల
*వైజాగ్ నా పుణ్య భూమి: ఆర్చ్‌బిషప్ బాల*
వేల మంది ప్రజల సాక్షిగా, ఘనంగా, ఆధ్యాత్మిక పండుగగా సాగిన వేడుకలో మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల విశాఖపట్నం ఆర్చ్‌బిషప్‌గా గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నంలోని జ్ఞానపురంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ గ్రౌండ్స్ లో జరిగిన ఆధ్యాత్మిక వేడుకకు పాపల్ రాయబారి, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ లియోపోల్డో గిరెల్లి నేతృత్వం వహించారు. విశాఖపట్నం రోమన్ క్యాథలిక్ అగ్ర పీఠానికి ఉడుముల బాలను అగ్ర పీఠాధిపతిగా ప్రతిష్టాపన చేశారు.
ప్రముఖ ఆర్చ్ బిషప్‌లు, బిషప్‌లు, ప్రొవిన్షియల్ సుపీరియర్లు, ప్రీస్ట్స్, మతాధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు. హైదరాబాద్ ఆర్చ్‌బిషప్ కార్డినల్ ఆంథోనీ పూలా, బిషప్ ఎమెరిటస్ గాలి బలి దివ్య సందేశాలిచ్చారు. అవుట్ గోయింగ్ అపోస్టలిక్ బిషప్ జయరావుతో పాటు, 500 మందికి పైగా ప్రీస్టులు, 500 మంది నన్స్, 10,000 మంది విశ్వాసులు ఈ చారిత్రాత్మక ఘట్టానికి ప్రత్యక్ష సాక్షులయ్యారు.
తన తొలి ప్రసంగంలో ఉడుమల బాల “వరంగల్ నా జన్మభూమి అయితే – విశాఖ నా పుణ్యభూమి,” అని అన్నారు. వరంగల్ నుంచి, పవిత్ర భూమి వైజాగ్‌కు రావడం దేవుని కృప అని నమ్ముతున్నానన్నారు. గొప్ప మనస్సు కలిగిన ప్రజల మధ్య సేవ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఐక్యత, శాంతి, సహకారం, అందరి మతాల మధ్య సామరస్యమే తమ లక్ష్యమని చెప్పారు. “విశాఖ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు. కలిసికట్టుగా మెరుగైన విశాఖ, మెరుగైన ఆంధ్రప్రదేశ్, మెరుగైన భారత్ ను నిర్మిద్దాం,” అని పిలుపునిచ్చారు.
ఈ వేడుకకు ముందుగా వాల్తేరు ఆర్.ఎస్.లోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి సెయింట్ పీటర్స్ కేథడ్రల్ వరకూ ఊరేగింపు జరిగింది. అనంతరం సత్కార సభ, విందుతో వేడుక ముగిసింది.
భారతీయ చర్చి వ్యవస్థలో గొప్ప గుర్తింపు పొందిన ఆర్చ్ బిషప్ బాల పలు విభాగాలలో పనిచేశారు. ఆయన 2013లో వరంగల్ బిషప్‌గా నియమితులయ్యారు. 2022 నుండి 2024 వరకు ఖమ్మం అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 8, 2025న, పోప్ ఫ్రాన్సిస్ ఆయనను విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా నియమించారు. ఈ నియామకం ద్వారా కోస్తాంధ్ర చర్చికి కొత్త దశ మొదలైంది
*వైజాగ్ పై ప్రశంసలు కురిపించిన వాటికన్ అంబాసిడర్*
ఈ క్రైస్తవ దివ్య పూజా వేడుక పోప్ ఫ్రాన్సిస్ ప్రతినిధి, భారత్- నేపాల్ అపోస్టోలిక్ నున్సియో(అంబాసిడర్), ప్రాతినిధ్యం వహిస్తున్న మోస్ట్ రెవరెండ్ డాక్టర్ లియోపోల్డో గిరెల్లి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆర్చ్ బిషప్ లియోపోల్డో గిరెల్లి ఆశీర్వాదములను అందిస్తూ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. “విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా ఉడుమల బాలను ప్రతిష్టించిన ఈ శుభ సందర్భంలో మీ అందరితో కలిసి ఉండడం, విశాఖపట్నం ఆర్చ్ బిషప్కు కొత్త చీఫ్ పాస్టర్‌ను బహుమతిగా ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉన్నాను” అని ఆయన అన్నారు.
ఈ బాధ్యతలను స్వీకరించినందుకు ఆర్చ్ బిషప్ బాలను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. బాల నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం లో లక్షకు పైగా కాథలిక్ ప్రజలు ఉన్నారని, ప్రీస్ట్స్, నన్స్ తో కూడిన బలమైన ఉనికి, పారిష్ కార్యకలాపాలలో సామాన్యుల భాగస్వామ్యం ద్వారా ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలిచిందని కొనియాడారు. పాస్టోరల్ విధుల్లో సామాన్యులు భాగంగా ఉండడం, యువత పాత్ర, సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ, యూత్ అసోసియేషన్ అండ్ ఆల్టర్ సర్వర్స్ అసోసియేషన్ వంటి వివిధ పవిత్ర సంఘాల కృషిని ఆయన ప్రశంసించారు. విశ్వాసులు మతపరమైన జీవితం, భక్తి ఆచారాలలో, మరియన్ పుణ్యక్షేత్రాలలో నిమగ్నమై ఉన్నారని, ఇది ఈ ప్రాంతం ఆధ్యాత్మిక లోతును ప్రతిబింబిస్తుందని కూడా ఆయన తెలిపారు.
ఆర్చ్డియోసెస్ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా ఆర్చ్ బిషప్ లియోపోల్డో గిరెల్లి స్పందించారు. ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, వలసదారుల దీన పరిస్థితి, పర్యావరణానికి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యలు తీవ్రమైనవి అయినప్పటికీ, చర్చి క్రీస్తు వెలుగులో మరింత ప్రకాశవంతంగా, అర్థవంతంగా ముందుకు సాగడానికి అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.
కొత్తగా నియమితులైన ఆర్చ్‌బిషప్ బాలాను ఆయన మేధోపరమైన, మతసంబంధమైన లక్షణాలను ఆర్చ్‌బిషప్ గిరెల్లి ప్రశంసించారు. నైతిక వేదాంతశాస్త్రంలో ఆర్చ్‌బిషప్ బాల జ్ఞానం అమోఘమని, ఆయన మతసంబంధమైన సున్నితత్వం, బోధనా సామర్థ్యాలు, 2015 నుండి 2023 వరకు CCBI కమిషన్ ఫర్ సెమినేరియన్స్, మతాధికారిగా బాధ్యతలు, ఛైర్మన్‌గా ఆయన అనుభవాన్ని హైలైట్ చేశారు. ఇవన్నీ ఆర్చ్‌డయోసెస్ భవిష్యత్తు ప్రయాణంలో ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ ప్రకాష్ మల్లవరపు ఆర్చ్డయోసిస్కు చేసిన సుదీర్ఘమైన, అంకితభావ సేవలకు అపోస్టోలిక్ నన్సియో కృతజ్ఞతలు తెలిపారు. అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా తన పదవీకాలంలో పాస్టోరల్ నాయకత్వానికి చేసిన సేవలకు బిషప్ జయరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది సీనియర్ చర్చి నాయకులు హాజరయ్యారు, వీరిలో ఆర్చ్‌బిషప్ ఎమెరిటస్ ప్రకాష్ మల్లవరపు, రాయ్‌పూర్ ఆర్చ్‌బిషప్ విక్టర్ హెన్రీ ఠాకూర్, CCBI వైస్ ప్రెసిడెంట్, బెంగళూరు ఆర్చ్‌బిషప్ పీటర్ మచాడో, ఆగ్రా ఆర్చ్‌బిషప్ రాఫీ మంజలీ, ఇతర ఆర్చ్‌బిషప్‌లు, బిషప్‌లు పాల్గొన్నారు.