VIZAGVISION:Boat Capsizes Krishna River Boat tragedy 16 dead Bodies Vijayawada,కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ వద్ద పవిత్ర సంగమం ప్రాంతంలో పెను విషాదం చోటు చేసుకుంది.
ఆదివారం సాయంత్రం రివర్బే సంస్థకు చెందిన పర్యాటకుల బోటు కృష్ణానదిలో తిరగబడింది.
ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 40 మంది పర్యాటకులు బోటు డ్రైవర్ ఉన్నారు.
వారిలో 15 మందిని రక్షణ సిబ్బంది, స్థానికులు కాపాడారు.
మిగిలిన వారికోసం కోసం గాలింపు కొనసాగుతోంది.
ఇప్పటి వరకు 16 మృతదేహాలను వెలికితీశారు.
గల్లంతైన 10 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో గాలింపు చేపట్టారు.
పర్యాటక బోటులో ఉన్నవారిలో 32 మంది ఒంగోలు వాసులు, 8మంది నెల్లూరు వాసులుగా గుర్తించారు.
ఘటనపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించారు.
పర్యాటకుల బోటు భవానీద్వీపం నుంచి పవిత్ర సంగమం ప్రదేశానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటం, బోటులో ఉన్న వారికి లైఫ్ జాకెట్లు లేకపోవడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది.
బోటులో ఉన్న 40 మంది పర్యాటకులు ఒకవైపునకు కూర్చోవడంతో ఫెర్రీఘాట్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బోటు తిరగబడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
బోటు తిరగబడటంతో దానికిందే ఇరుక్కు పోయి వూపిరాడక నీటమునిగి చనిపోయినట్లు తెలిపారు.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రాత్రి సమయం కావడం, చలి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది.
ప్రత్యేక ఫ్లడ్ లైట్ల వెలుతురులో తిరగబడిన బోటును సరిచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఫెర్రీఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజి వరకు విహారయాత్రకు కొన్ని ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది.
దీంతో నిత్యం పర్యాటకులు కృష్ణానదిలో విహార యాత్రకు వస్తున్నారు.
ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతి లేదని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
పర్యాటకుల కోసం బోటు నిర్వాహకులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని గుర్తించారు.
రివర్బే సంస్థ తొలిసారిగా ఇవాళే రాయపూడి నుంచి పవిత్ర సంగమం వరకు బోట్ షికారు నిర్వహించాలని ట్రయల్ నిర్వహించిందని, తొలిసారి వచ్చిన బోటే ప్రమాదానికి గురైందని స్థానికులు చెబుతున్నారు.
*కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 16 మంది మృతిచెందగా, 10 మంది గల్లంతయ్యారు.*
ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఏపీ శాసనసబాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రులు చినరాజప్ప, శిద్దా రాఘవరావు, నారా లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, పితాని సత్యనారాయణ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.