VIZAGVISION:Heavy Rains Expected.Visakhapatnam…
తీవ్ర అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరి కోన్ని గంటల్లో కోస్తాకు దగ్గరగా రానుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో కోస్తాలో గత రెండురోజులుగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తీరం వెంబడి గంటకు 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.తీవ్ర అల్పపీడనం వాయువ్యంగా పయనించనున్నందున బుధవారం ఉత్తర కోస్తాలో వర్షాలు పెరిగే అవకాశముందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. గాలులు వీస్తున్నందున చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్లో తొమ్మిది డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.