ప్రజాభీష్టమే… మా ఇష్టం..సచివాలయ భవన ఆకృతులకు ముఖ్యమంత్రి సూత్రప్రాయ ఆమోదం రాజధాని నగరంలోని ప్రభుత్వ నగరంలో నిర్మించబోయే సచివాలయ భవనాల నమూనాలను గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భవన నమూనాలను ఆయన పరిశీలించి ప్రాధమికంగా రెండు కాటగిరీల్లోని 6 నమూనాలను ఎంపిక చేశారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు ఒకేచోట వుండే విధంగా వున్న భవన నమూనాలను ముఖ్యమంత్రి ఆమోదం లభించినట్లు సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈ భవనాల నమూనాలను ప్రజల అభిప్రాయాలు కోరుతూ సీఆర్డీఏ వెబ్సైట్లో, సోషల్ మీడియాలో, మన అమరావతి యాప్లో ఉంచుతారు. ప్రజల నుంచి అత్యుత్తమంగా ఎంపికైన నమూనాను తుది దశలో నిర్మాణానికి ఎంపిక చేస్తారని కమిషనర్ పేర్కొన్నారు. సుమారు 40 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించే ఈ భవనాలలో 16 వేల మంది ఉద్యోగులు, అధికారులు విధులు నిర్వహించుకునే వీలుంటుంది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మించే ఈ భవనాల్లో సౌకర్యవంతంగా పని చేసుకునే అవకాశం వుంటుంది. రోజులో 5 వేల మంది సందర్శకులు తమ పనులు కోసం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను సందర్శించే వీలు కల్పించారు. రియల్ టైం పరిపాలన కొనసాగుతున్న నేపధ్యంలో ప్రభుత్వ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, శాఖాధిపతులు వారి సిబ్బంది ఒకేచోట పని చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందించే వీలు కలుగుతుందని చెరుకూరి శ్రీధర్ తెలిపారు.