VIZAGVISION:Norman Foster Team is the newly designed two designs,Amaravathi…ప్రజామోదం కోసం ఆకృతులుఅమరావతిలో శిఖరాగ్ర పాలనా భవంతులు. నార్మన్ ఫోస్టర్ బృందంతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. శాసనసభ భవంతి తుది ఆకృతి ఎంపికలో ప్రజాభిప్రాయాన్ని అందరూ గౌరవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్ర శాసనసభ భవంతి కోసం నార్మన్ ఫోస్టర్ బృందం తాజాగా రూపొందించిన రెండు ఆకృతులపై బుధవారం సచివాలయంలో సవివర చర్చ జరిపిన అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ 13వ సమావేశంలో ఫోస్టర్ ఆకృతులపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పాల్గొని కొన్ని సూచనలు చేశారు. సమావేశంలో అత్యధికులు సూది మొన ఆకృతిలో ఉన్న టవర్ డిజైన్‌కే మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి లండన్ పర్యటనలో ఫోస్టర్ బృందం జరిపిన కార్యశాలలో పాల్గొని తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మన సంస్కృతి, వారసత్వాలకు అద్దం పడుతూనే మరింత సృజనాత్మకంగా, వైవిధ్యంగా ఆకృతులు ఉండాలని సూచించారు. దరిమిలా గతంలో ఫోస్టర్ బృందం రూపొందించిన పలు ఆకృతులను పబ్లిక్ డొమైన్లో ఉంచి సీఆర్డీఏ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. అలా అత్యధిక ప్రజానీకం ఎంపిక చేసిన ఆకృతులకు ముఖ్యమంత్రి సూచనల ప్రకారం మార్పులను జోడించి ఫోస్టర్ బృందం సరికొత్త ఆకృతులను రూపొందించింది. హైకోర్టు కోసం గతంలో ప్రతిపాదించిన బౌద్ధ స్థూపాకారపు ఆకృతిని మరింత ఆకర్షణీయంగా మలచి, ఫోస్టర్ ప్రతినిధులు తాజా సమావేశంలో ప్రదర్శించారు. అంతర్గత నిర్మాణాలు, అంతస్థుల ప్రణాళికలను వివరించారు.
శాసన సభ భవంతి కోసం రూపొందించిన రెండు ఆకృతులను సమావేశంలో ప్రదర్శించారు. సూది మొన కలిగిన టవర్ ఆకృతి, చతురస్రంగా ఉన్న మరో ఆకృతిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అత్యధికులు టవర్ బిల్డింగ్ వైపే మొగ్గు చూపారు. ఈ రెండు ఆకృతులను వెంటనే సీఆర్డీఏ పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచి ప్రజానీకం అభిప్రాయాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గురువారం మరోమారు ఫోస్టర్ బృందంతో సమావేశమై చర్చిద్దామని నిర్ణయించారు. నిర్మాణ, భద్రతాపరమైన అంశాలన్నింటినీ పరిశీలించి ప్రజాభిప్రాయం ప్రకారం తుది ఎంపిక చేద్దామని చెప్పారు. అత్యధికులకు నచ్చిన టవర్ డిజైన్ భవంతిలో కింది భాగంలో శాసనసభ ఉంటుంది. పైన ప్రజల సందర్శన నిమిత్తం పొడవైన వ్యూయింగ్ టవర్ నిర్మిస్తారు. ఈ తరహా నిర్మాణం ప్రపంచంలోనే వైవిధ్యమైనదని ఫోస్టర్ బృందం పేర్కొంది. టవర్ ఆకృతితో పాటు భవంతి బాహ్య కుఢ్యాలపై సినీ దర్శకుడు రాజమౌళి అందించిన త్రి డైమన్షియల్ చిత్రాలతో కూడిన చతురస్రాకారపు రెండో ఆకృతిని కూడా సీఆర్డీఏ పబ్లిక్ డొమైన్లో ఉంచుతారు. రెండింటిలో అత్యధిక ప్రజలు ఎంపిక చేసిన వాటిని తుది డిజైన్‌గా తీసుకుంటారు. సూర్యుడు ఉదయించే రాష్ట్రం కనుక సూర్యుడి ఇమేజ్. పురాతన నాణేలు, రాచరిక చిహ్నాలు, పూర్ణకుంభం, నెమలి ఈక వంటి చిత్రాలను పరిశోధించి ఫోస్టర్ బృందానికి అందించామని రాజమౌళి తెలిపారు. ఈ డిజైన్లతో పాటు పరిపాలన నగరం బృహత్ ప్రణాళికలో చేసిన కొన్ని మార్పులపై సమావేశంలో ఫోస్టర్ బృందం ప్రెజెంటేషన్ ఇచ్చింది. జల వనరులు, పచ్చదనం, నిర్మాణాలకు మధ్యన ప్రతిపాదించిన ఖాళీ స్థలం తదితర అంశాల్లో ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి, మెరుగైన బృహత్ ప్రణాళికను రూపొందించామని చెప్పారు. అమరావతి నిర్మాణంపై నిపుణులతో విజయవాడలో రేపటి నుంచి రెండురోజుల కార్యశాల నిర్వహిస్తున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సమావేశంలో చెప్పారు. కార్యశాలలో 15 బృందాలతో వివిధ అంశాలపై గోష్ఠులు నిర్వహిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్ ఎకానమీ, నిర్మాణ రీతులు, రవాణా వ్యవస్థ, ఉద్యోగాల కల్పన, సుస్థిర ఆర్థికాభివృద్ధి వంటి అంశాలతో పాటు నవ నగరాల నిర్మాణంపై బృంద చర్చలు సాగుతాయని తెలిపారు. స్థానికంగా వుండే ఆర్కిటెక్టులు, ప్రొఫెసర్లు, ప్రముఖులను ఈ కార్యగోష్ఠిలో భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. సమావేశంలో మంత్రి పి.నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు.