VIZAG VISION:Tokens Issue Centers in Thirumala…. తిరుమలలో సర్వదర్శనం భక్తులకు నిర్దేశిత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానం ప్రారంభమైంది. టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్.శ్రీనివాసరాజు సోమవారం ఉదయం 6 గంటలకు సిఆర్వో వద్ద గల కౌంటర్లలో పూజలు నిర్వహించి టోకెన్ల జారీని ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన శకుంతలారామన్ అనే భక్తురాలి ఆధార్‌కార్డును స్కాన్ చేసి మొదటి టోకెన్ అందజేశారు.సమయ నిర్దేశిత సర్వదర్శనం కోసం భక్తులు తప్పనిసరిగా ఆయా కౌంటర్ల వద్ద ఆధార్‌కార్డు చూపాల్సి ఉంటుంది. కౌంటర్ల వద్ద ఖాళీగా ఉన్న స్లాట్ల వివరాలను భక్తులు తెలుసుకునేందుకు వీలుగా మానిటర్లను ఏర్పాటుచేశారు. భక్తులు 24 గంటల వ్యవధిలో ఖాళీగా ఉన్న స్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి. టోకెన్ పొందిన అనంతరం అందులో సూచించిన సమయానికి ఎటిసి కార్ పార్కింగ్ ప్రదేశంలోని దివ్యదర్శనం కాంప్లెక్స్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ టోకెన్లు తనిఖీ చేసి రూ.10/- చొప్పున 2, రూ.25/- చొప్పున 2 లడ్డూ టోకెన్లు అందిస్తారు. రెండు గంటల్లోపు స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఆధార్‌కార్డులు లేని భక్తులు పాత పద్ధతిలో సర్వదర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
కేంద్రీయ విచారణ కార్యాలయం, సప్తగిరి సత్రాలు, కౌస్తుభం విశ్రాంతిగృహం, సన్నిధానం, ఆర్టిసి బస్టాండు, పద్మావతి నగర్ కాషన్ డిపాజిట్ రీఫండ్ కౌంటర్, ఎంబిసి-26 లగేజి కౌంటర్, ఎటిసి, శ్రీ వరాహస్వామి, నందకం విశ్రాంతి సముదాయాలు, కల్యాణవేదిక, గాలిగోపురం, శ్రీవారిమెట్టు మార్గం, ఆళ్వారుట్యాంక్ వద్ద టోకెన్ల జారీ కౌంటర్లు ఉన్నాయి.