సంక్రాంతి దగ్గరకొస్తున్న కొద్దీ ఏపీలో కోడిపందేల సందడి మొదలవుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు మొదలుకొని… బడా పారిశ్రామికవేత్తలవరకూ అంతా సంక్రాంతిని
కోడిపందేల ద్వారా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే చింతమనేని లాంటి వారి కోడిందేలు తప్పేకాదని… పందేలు వేసి తీరుతామని నొక్కి చెప్పారు. కానీ ఇప్పుడు ఇలాంటి వారికి హైకోర్టు భలే షాక్ ఇచ్చేసింది.
ఆంధ్రాలో కోడి పందేలపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ సంక్రాంతికి పందేలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. తమ ఆదేశాలు అమలు కాకపోతే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చేసింది. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు కళ్లు మూసుకోవడం సరికాదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించాలంటూ రామచంద్రరాజు అనే వ్యక్తి దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కోడి పందేల నిర్వహణపై గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ శ్యాంప్రసాద్ తో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కోడిపందేలు తమ జన్మహక్కులా ఫీలవుతున్న పొలిటికల్ లీడర్లపైనా ఘాటుగా కామెంట్స్ చేసింది హైకోర్ట్.. ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని… వారికి కోర్టు ఉత్తర్వులంటే గౌరవం లేకుండా పోయిందని హైకోర్టు కామెంట్ చేసింది. ఈ సందర్భంగా కోడిపందేలపై సుప్రీంకోర్టు గత ఆదేశాలను ప్రస్తావించింది. సుప్రీంకోర్టు పందేలు నిర్వహించుకో వచ్చునని ఎక్కడా చెప్పలేదని తేల్చి చెప్పింది. గతేడాది డిసెంబరులో ఇచ్చిన ఆదేశాలు ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని అధికారులను నిలదీసింది. చట్టాలు సరిగ్గా అమలు చేయడం రాకపోతే.. ఆ విషయం సూటిగా చెప్పాలని.. సమర్థులను నియమించాలని గవర్నమెంట్ ను ఆదేశిస్తామని కోర్టు వార్నింగ్ ఇచ్చింది.