VIZAG VISION:Temples as political rehabilitation centers,Visakhapatnam..విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం శోచనీయమని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఆలయాలు మారాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనమా అని మండిపడ్డారు. దేవాలయ వ్యవస్థను కుప్పకూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని స్వరూపానంద ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని విమర్శించారు. నిజాలు నిగ్గు తేల్చడానికి ఏ ప్రయత్నం జరుగుతుందని ప్రశ్నించిన ఆయన తాంత్రిక పూజలు చేసి రాష్ట్రాన్ని ఏం చేస్తారని నిలదీశారు.
భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని స్వరూపానంద మండిపడ్డారు. గుడిలో పూజలపై ఇంత వరకు నిజనిర్దారణ కమిటీ వేయలేదన్నారు. పోలీసు విచారణ జరిపించి కుంటిసాకులు చెబుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ దుర్గ గుడిలో రెండేళ్లుగా అనేక అపచారాలు జరుగుతున్నాయన్నారు. దుర్గ గుడి ఈవోపై ఎన్నో ఆరోపణలున్నా చర్యలెందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. తాంత్రిక పూజలపై శారదాపీఠం తరఫున సీఎంకు లేఖ రాస్తామని, దేవాలయాల విషయంలో ప్రభుత్వ తీరుపై కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. త్వరలో పీఠాధిపతుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్వరూపానంద తెలిపారు.