పర్యావరణ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌తో శ్రీ వి.విజయసాయి రెడ్డి భేటీ…
అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో పర్యావరణ కాలుష్యంపై ఫిర్యాదు
న్యూఢిల్లీ: విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో నెలకొన్న స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఎస్ఈజెడ్)లో దాదాపు 40 కంపెనీలు పర్యావరణ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ కాలుష్యం సృష్టిస్తున్నాయంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్ఈజెడ్లో దాదాపు 40 కంపెనీలు పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టవలసిన మురుగు నీటిని శుద్ధి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయనందున అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని అనేక గ్రామాల్లో తాగు నీరు కలుషితంగా మారిపోయిందని, శుద్ధి చేయని కాలుష్య జలాలను ఆయా కంపెనీలు సముద్రంలోకి విడుదల చేస్తున్నందున సముద్ర జలాలు కూడా కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని శ్రీ వి.విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకువచ్చారు.
ఎస్ఈజెడ్లోని కంపెనీల కారణంగా భూగర్భ జలాలు, సముద్ర జలాలు కూడా కలుషితమైపోతూ రైతులు, మత్స్యకారులకు ఎనలేని నష్టాన్ని కలిగిస్తున్నాయని, ఈ సమస్యపై ఎస్ఈజెడ్ పరిసర బాధిత గ్రామాల ప్రజలు అనేకమార్లు ఆందోళనలు చేపట్టారు. తమ గోడు పట్టించుకోవాలంటూ పలుమార్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కు మొత్తుకున్నా సమస్య పరిష్కారం కాలేదని కాబట్టి తక్షణమే దీనిపై స్పందించి ఎస్ఈజెడ్లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుని బాధిత గ్రామాల ప్రజలను జల కాలుష్యం బారి నుంచి కాపాడాలని శ్రీ విజయసాయి రెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు.