తిరుమల: చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 31న తిరుమల శ్రీవారి ఆలయాన్ని తితిదే మూసివేయనుంది. సాయంత్రం 5:18 గంటల నుంచి రాత్రి 8.41 గంటల వరకు గ్రహణం ఏర్పడనుంది. గ్రహణం ఘడియలు ప్రారంభానికి 8 గంటల ముందుగా అంటే ఉదయం 8 గంటల నుంచి శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. రాత్రి 9 గంటలకు ఆలయ తలుపులు తెరచి ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా పూర్తి చేసి శ్రీవారి దర్శనాన్ని పునరుద్ధరిస్తారు. 31న వేకువజామున సుప్రభాతం, తోమాల, అర్చన, సహస్ర కలశాభిషేకం సేవలను యథావిధిగా నిర్వహించాక ఆలయ తలుపులను మూసివేస్తామని తితిదే ఈవో అనీల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.