Vizag Vision:Sankranthi Sabarala Festival,Visakhapatnam..ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర, పుష్యమాసాల్లో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోనికి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. మన పూర్వులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణమనీ, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయణమనీ అన్నారు. సంక్రమణ అంటే ఒకచోటి నుంచి మరో చోటికి జరిగే మార్పు అని అర్థం. సూర్యుడు తన నిరంతర కాల ప్రయాణంలో ధనూరాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటారు..సంక్రాంతి పండుగలో ముందుగా వచ్చేది భోగి పండుగ.
భోగం గలది కాబట్టి భోగి అంటారు. భోగిరోజున బాగా గుర్తుండేవి భోగి పళ్లు, భోగి మంటలు. ఈరోజు కొత్త బియ్యం, పెసర పప్పు కలబోసి కిచిడి తయారుచేసి భోగి పురుషునికి నైవేద్యం పెడుతారు. భోగి పండుగ నాడు తెల్లవారుజామున స్నానానంతరం ప్రతి ఇంటి ముంగిట మంటలు వేస్తారు.
ఈ మంటలలో ధనుర్మాసం నెల రోజులూ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెడితే వచ్చే పిడకలను దండలుగా గుచ్చుతారు. వాటిని, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తని అక్కరకు రాని చెట్టు మొద్దుల్ని గుండంలో పడేసి భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటలతో పాతకు స్వస్తి చెప్పి, కొత్తకు స్వాగతం చెబుతారు.
ఇది భోగ వాంఛ గలవారు చేసే అగ్ని పూజ.
దీన్ని చేస్తే యజ్ఞం చేసినట్లు. సాయంత్రం బొమ్మల కొలువు పెడుతారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. నానబెట్టిన శనగలు, పూలరేకులు, చిన్న రేగుపళ్లు, చిల్లర పైసలు, అక్షింతలు కలిపి చంటిపిల్లల తల చుట్టూ మూడుసార్లు తిప్పి తల మీద పోస్తారు.
వీటితో పాటు చెరుకు ముక్కల్నీ పోస్తారు. ఈ కార్యక్రమం ఆహ్లాదకరాన్ని ఇవ్వడమే గాక భోగిపళ్లలో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉంటాయి.