ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లా నుంచే తన పర్యటన ఉంటుందని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఇవాళ ఆయన కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
“నేను 2009 ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది.
నేను సంపూర్ణ రాజకీయ జీవితంలోకి రావాలనుకున్నప్పుడు కూడా కొండగట్టు అంజన్నను దర్శించుకోవాలనుకున్నాను.
అందుకోసమే కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నా.
ఆంజనేయస్వామిని నమ్మితే అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయనే నమ్మకం నాకు ఉంది.
ఇక నా పర్యటన అనంతపురం జిల్లా నుంచి ఈ నెల 27 న ప్రారంభమవుతుంది.
పార్టీ కార్యాలయాలు కూడా అనంతపురం జిల్లా నుంచే ప్రారంభించాం.
అనంతపురం పర్యటన తర్వాత తదుపరి జిల్లాల పర్యటన తేదీలు ఖరారు చేస్తాం.
అయితే.. ఒంగోలులో ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులను కలుస్తాం.
విశాక ఏజెన్సీ ప్రాంతంలోనూ మా పర్యటన ఉంటుంది.
కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వెళ్తాం. జనసేన వేదికల ద్వారా రేపు, ఎల్లుండి పార్టీ కార్యకర్తల సమావేశాలు జరుగుతాయి.
కార్యకర్ల సమావేశాల్లో సమస్యలు, సూచనలను స్వీకరిస్తాం.
కార్యకర్తలతో ఆలోచించి ఏఏ సమస్యలపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై ముందుకెళ్తా” అని పవన్ కల్యాణ్ అన్నారు.