దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు.. ఢిల్లీ పోలీసులను హెచ్చరించాయి. ఈ వారంలోనే గణతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఢిల్లీ వేదికగా జరగనున్న ఏషియన్ సమ్మిట్, పద్మావత్ సినిమా విడుదల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్‌పథ్‌తో పాటు ఢిల్లీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. పద్మావత్ సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరిస్తుండటంతో.. పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ మూడు ఈవెంట్స్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జనవరి 24 నుంచి 26 ఏషియన్ సమ్మిట్ జరగనుంది. 25న పద్మావత్ విడుదల కానుంది.
26న రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. గణతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రాజ్‌పథ్‌లో పోలీసులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. రాజ్‌పథ్ వద్ద ఎన్ఎస్జీ కమాండోస్, స్పెషల్ ఫోర్స్ బందోబస్తులో ఉన్నాయి.