అలనాటి అందాల నటి కృష్ణకుమారి (83) తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం బెంగళూరులో కన్నుమూశారు.
తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో ఆమె ఎన్నో సినిమాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు.
అగ్రనటిగా కొనసాగిన ఆమె… ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులాంటి పాత తరం అగ్ర హీరోలందరి సరసన నటించారు.
‘నవ్వితే నవరత్నాలు’ సినిమాతో ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
భార్యాభర్తలు, కులగోత్రాలు, గుడిగంటలు, వాగ్దానం, పిచ్చిపుల్లయ్య, బంగారుపాప, వీరకంకణం, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు, నిత్యకల్యాణం పచ్చతోరణం, ఉమ్మడి కుటుంబం, తిక్క శంకరయ్య, చిలకాగోరింక, మానవుడు దానవుడు, శ్రీకృష్ణావతారం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆమె నటించారు.
ఆమె మరణంతో సినీరంగం ఒక్కసారిగా షాక్ కు గురైంది.
సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
పశ్చిమ బెంగాల్ లోని నైహతిలో 1933 మార్చి 6న కృష్ణకుమారి జన్మించారు.
నటి షావుకారు జానకి ఈమె అక్క. సుమారు 110కి పైగా తెలుగు సినిమాల్లో కృష్ణకుమారి నటించారు.
బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్ ను పెళ్లాడిన ఆమె అక్కడే ఉండిపోయారు.
కృష్ణకుమారి దంపతులకు దీపిక అనే కుమార్తె ఉన్నారు.