Vizag Vision:Kanaka Durga Temple Flyover construction Works in Accident,Vijayawada….విజయవాడలో కనకదుర్గ పైవంతెన వద్ద తప్పిన భారీ ప్రమాదం..
* సిమెంట్ వింగ్‌ను తీసుకువస్తూ అదుపు తప్పి డ్రైయిన్‌పై బోల్తా పడిన ట్రాలీ
* ఘటనలో రెండు ముక్కలైన ట్రాలీ, కింద పడిపోయిన సిమెంట్ వింగ్
* ఆ సమయంలో రాకపోకలు లేకపోవడంతో తప్పిన ప్రమాదం..
సెల్ఐటి న్యూస్, విజయవాడ: విజయవాడలో నిర్మిస్తున్న కనకదుర్గ పైవంతెన వద్ద శుక్రవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అటువైపుగా పాదచారులు, వాహనచోదకుల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైవంతెనకు అమర్చేందుకు శుక్రవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో సిబ్బంది (ఎపి16టిడబ్ల్యూ2104) నంబరు గల భారీ ట్రాలీ మీద సిమెంట్ వింగ్ (పైవంతెనకు అమర్చే సిమెంట్ రెక్క)ను తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో కుమ్మరిపాలెం వద్దకు రాగానే అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో ట్రాలీని డ్రైవర్ మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. ఈ నేపధ్యంలో ట్రాలీతో పాటు దానిపైన ఉన్న సిమెంట్ వింగ్ బరువుకు మలుపు వద్ద ఉన్న డ్రెయిన్‌పై చప్టాలు విరిగిపోవడంతో ట్రాలీ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ట్రాలీ మీద ఉన్న సిమెంట్ వింగ్ సైతం కింద పడిపోయింది. ఇదే క్రమంలో ట్రాలీ, ఇంజన్ ఒకదానికొకటి రెండు భాగాలుగా విడిపోయాయి. దీంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమై పెద్ద భారీ క్రేన్‌తో పాటు మరో మూడు క్రేన్ల సహాయంతో కింద బోల్తా పడిన ట్రాలీని గంట పాటు శ్రమించి అతికష్టం మీద పైకి లేపారు. డ్రెయిన్ మీద పడిన సిమెంట్ దిమ్మను తీసే ప్రయత్నం చేసినా సాధ్యం కాకపోవడంతో సిబ్బంది తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. నిర్మాణ పనుల నిమిత్తం అడపాదడపా ఇటువైపు సోమా కంపెనీ వాహనాలు రాకపోకలు సాగించే క్రమంలో పాదచారులు, వాహనచోదకులు కూడా ఇటువైపుగానే రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో అదృష్టవశాత్తు అటువైపుగా రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే పైవంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతున్న విషయం విధితమె. అలాగే పైవంతెన నిర్మాణ పనుల జాప్యంపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం రెండు రోజుల క్రితం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా తెలిసిందే. నిర్మాణ పనులు చేసే క్రమంలో ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా సిబ్బంది సాగిస్తున్న నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది.