ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉదయం 3:30 గంటలకు ఎస్ఆర్నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఎర్రగడ్డ సెయింట్ థెరిసా హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తెలుగు సినిమాల్లో హాస్యనటుడిగా ఆయన 400 సినిమాల్లో నటించారు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రాలకిచ్చే నంది అవార్డులు అందుకున్నారు. 1956లో కాంతారావు, సరోజిని దంపతులకు హన్మంతరావు జన్మించారు. 1974లో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు.
నాటకాల్లో ఆయన వేసిన మొదటి వేషం రావణబ్రహ్మ. మద్రాసులో ఆయన నాటకాన్ని చూసిన జంద్యాల అహనా పెళ్లంట సినిమాలో మొదటి వేషం ఇచ్చారు. అనంతరం వరసగా సినిమా అవకాశాలు రావడంతో 50 సినిమాలు నటించిన తరువాత తన నివాసం విజయవాడ నుంచి హైదరాబాద్కు మార్చారు. ఆయన భార్య ఝాన్సీరాణి(45) 2010లో మృతి చెందారు.