Shock to BJP…Haribabu Resignation,Vizag Vision..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. నిన్నే తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చేసిన సహాయంపై బహిరంగ లేఖ రాసిన హరిబాబు.. ఆ వెంటనే తన రాజీనామా లేఖను అధ్యక్షుడు అమిత్ షాకు పంపినట్టు సమాచారం. హరిబాబు రాజీనామాకు కారణాలు తెలియలేదు కానీ… అంతర్గత విభేదాల వల్లే ఆయన రాజీనామా చేసినట్టు ప్రాథమిక సమాచారం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. 2014 మార్చి నుంచి ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీనామా సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ బీజేపీ వైపు వేలెత్తి చూపుతున్నాయి.
రాష్ట్రానికి మోదీ అన్యాయం చేశారనే ఫీలింగ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రజల దృష్టిలో బీజేపీ దోషిగా నిలబడింది.
కేంద్రంలోని మోదీ సర్కార్ కు, ఎన్డీయేకి టీడీపీ గుడ్ బై చెప్పిన తర్వాత.. టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. కేంద్రం ఏమీ చేయలేదని, అందుకు బయటికొచ్చామని టీడీపీ చెప్తుంటే.. మేము ఇవన్నీ చేశామంటూ బీజేపీ ప్రతి జవాబు ఇస్తూ వస్తోంది. అయితే మిగిలిన నాయకుల్లాగా టీడీపీపై నేరుగా విమర్శలు చేయకుండా.. తమ పార్టీ చేసిన వాటిని మాత్రమే ప్రజల ముందు ఉంచుతూ వస్తున్నారు హరిబాబు. ఇది పార్టీలోని ఓ వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. హరిబాబు టీడీపీతో సన్నిహితంగా మెలుగుతున్నారని కొంతమంది నేతలు అధిష్టానానికి చేరవేశారు.
అధ్యక్షుడిగా హరిబాబు మాత్రం సంయమనంతో వ్యవహరించేవారు. అయితే ఆయన పనితీరు నచ్చని కొంతమంది నేతలు ఆయనపై ఎన్నో ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తప్పించి వేరొకరికి ఆ బాధ్యలు అప్పజెప్పాలని అధిష్టానం యోచిస్తోంది. అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారా.. లేక మనస్థాపంతో రాజీనామా చేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. మాణిక్యాల రావుకు అధ్యక్ష పదవి ఖరారైందని కొంతకాలం కిందట వార్తలొచ్చాయి. ఆ వెంటనే సోము వీర్రాజు పేరు వినిపించింది. తాజాగా.. సీబీఐ జేడీ లక్ష్మినారాయణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని, వచ్చే ఎన్నికలకు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం.. ఏది నిజమో..!