ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల దేశంలో పారిశ్రామిక విధ్వంసం జరుగుతుందని, దీంతో అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయని, లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయని స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్డబ్ల్యుఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శి పికె.దాస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉక్కు నగరం గురజాడ కళాక్షేత్రం ఎస్.రమేష్‌నగర్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) పదో మహాసభలు మంగళవారం ముగిశాయి. ముగింపు రోజు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పికె.దాస్ మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక ఉక్కు పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ప్రభుత్వ రంగంలోని సేలమ్, దుర్గాపూర్ స్పెషల్ స్టీల్, విశ్వేశ్వరయ్య స్టీల్‌లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రపంచంలో తలసరి ఉక్కు వినియోగం 208 కేజీలు ఉండగా.. భారత్‌లో ఇది కేవలం 61 కేజీలుగా ఉన్నందుకు అందరూ సిగ్గుపడాల్సిన విషయమన్నారు. అన్ని పరిశ్రమలకూ ఉక్కు పరిశ్రమ కీలకమని, ఈ ఉక్కు పరిశ్రమ పరిస్థితి ఇలా ఉంటే మిగతా పరిశ్రమల పరిస్థితి ఏలా ఉంటుందో అర్ధం చేసుకోవాలని వివరించారు. ఉక్కు తలసరి వినియోగంలో పాకిస్థాన్ కూడా భారతదేశం కంటే ముందంజలో ఉందన్నారు. పారిశ్రామిక ఉద్యోగులు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారని, దేశాన్ని అభివృద్ధి చేయగలిగే, ముందుకు నడపగలిగే శక్తి కార్మికవర్గానికి ఉందని అన్నారు. ఈ సమాజానికి కార్మికవర్గం నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. కార్మికవర్గంలో కమ్యూనిస్టు భావజాలం చొప్పించకుండా కార్మిక ఉద్యమం ముందుకుసాగడం కష్టమన్నారు. 140 కోట్ల మంది భారత ప్రజానీకంలో సంఘటిత కార్మికవర్గం 2 శాతం మాత్రమే ఉంటుందని ప్రజానీకాన్ని సమీకరించాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందని వివరించారు.
ఆప్లోడింగ్, ఔట్సోర్సింగ్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి : తపన్‌సేన్
ఆఫ్‌లోడింగ్, ఔట్సోర్సింగ్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ పిలుపునిచ్చారు. బడా పారిశ్రామికవేత్తలు పెద్దపెద్ద మాల్స్ ఏర్పాటు చేసి చిన్నచిన్న వ్యాపారుల ఉపాధికి గండికొడుతున్నారని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌లో ఆఫ్‌లోడింగ్, ఔట్సోర్సింగ్ ప్రారంభమైతే మొత్తం స్టీల్‌ప్లాంట్ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉన్నందున దీన్ని ఆదిలోనే అడ్డుకోవాలన్నారు.
విశాఖ ఉక్కులో సిఐటియు సంఘాన్ని మరింత బలోపేతం చేసే విధంగా బహుముఖ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఒఎండిసి మైన్స్ సమస్యపై ఉక్కు కార్యదర్శి, మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తేవాలని, అలాగే గనుల కోసం పోరాడాలని సూచించారు. కార్మికుల సమస్యలు, ప్రభుత్వ విధానాలు ప్రభావం ఆ ప్రభుత్వాల రాజకీయ విధానాలను కార్మికుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభల సందర్భంగా 82 మంది ఆఫీస్ బ్యారర్స్్తో నూతన కమిటీ, కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా జె.అయోధ్యరామ్, ప్రధాన కార్యదర్శిగా వైటి.దాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా డాక్టర్ బి.గంగారావు, ఉపాధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు ఎన్నికయ్యారు.