తూత్తుకుడి కాల్పుల మృతుల కుటుంబాలను తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ బుధవారం ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు
ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందని చెప్పారు. తూత్తుకుడి ఘటన ఓ గుణపాఠం వంటిదని తెలిపారు.
బాధితులను పరామర్శించిన అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ ఈ సంఘటనపై తాను మరేమీ మాట్లాడనని చెప్పారు.
అయితే ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుందని చెప్పారు.
నిరసనకారులపై కాల్పులు జరపడం చాలా పెద్ద తప్పు అని తెలిపారు.
పోలీసుల కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు.
పోలీసు కాల్పుల్లో గాయపడినవారు చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రికి రజనీకాంత్ వెళ్ళారు.
అక్కడ చికిత్స పొందుతున్న నిరసనకారులను పరామర్శించి, అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసన కార్యక్రమంలో 100వ రోజు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు. దాదాపు 65 మంది గాయపడ్డారు.
స్టెరిలైట్ యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించిందని రజనీకాంత్ ఆరోపించారు.
ఈ ప్లాంట్‌ను తిరిగి తెరవకూడదని డిమాండ్ చేశారు.
హింసాత్మక సంఘటనలో పాల్గొన్న సంఘ వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటన ప్రభుత్వానికి పెద్ద గుణపాఠమన్నారు.
ఇంత భారీ స్థాయిలో హింస జరుగుతుందని ఎవరూ ఊహించలేదన్నారు.
నిఘా వర్గాలకు సమాచారం ఉండే ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు అన్నీ తెలుసునని, సమయం వచ్చినపుడు సమాధానం చెబుతారని అన్నారు.
ఏదైనా సమస్య వచ్చినపుడు ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సరికాదని, రాజీనామా పరిష్కారం కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు