టీటీడీలో ఒకేసారి 142 మంది పదవీ విరమణ..టీటీడీలో నేడు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులు
పెరగనున్న పనిభారం
కొత్త నియామకాలతోనే ఉపశమనం
తిరుపతి(టీటీడీ): టీటీడీలో ఒక్కసారిగా 142 మంది పదవీ విరమణ చేయనున్నారు. శనివారం తర్వాత వీరంతా విశ్రాంత ఉద్యోగులు కానున్నారు. ఇప్పటి వరకు వీరు నిర్వర్తించిన విధుల భారం.. మిగతా ఉద్యోగులపై పడనుంది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు దేశవ్యాప్తంగా విలీన ఆలయాల నిర్వహణ బాధ్యతలను టీటీడీ చూస్తోంది. నాలుగేళ్ల కిందట పది వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించేవారు. ప్రతినెలా జరిగే పదవీ విరమణలతో ఈ సంఖ్య 8 వేలకు పడిపోయింది.
ఇలా పదవీ విరమణ చేసిన రెండు వేల మంది స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టలేదు.
దీంతో ఉన్న సిబ్బందిపై పని భారం పెరిగింది. ఒత్తిడి నేపథ్యంలో కొందరు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇంకొందరు షుగర్‌తో ఇబ్బంది పడుతున్నారు. టీటీడీలో కొత్తగా నియామకాలు చేపడితేనే ప్రస్తుత ఉద్యోగులకు పనిభారం నుంచి ఉపశమనం లభించనుంది. ఈ దిశగా టీటీడీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదని తెలిసింది. కాగా, టీటీడీలో కాంట్రాక్టు పద్ధతిన 12 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరు వసతి గృహ సముదాయాల పరిశుభ్రతకు పరిమితమవుతున్నారు.
మోయలేని భారం
టీటీడీలోని వివిధ విభాగాల్లో 142 మంది శనివారం పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో.. తిరుమల కల్యాణకట్టలో 30 మంది క్షురకులు, అటెండర్లు, హెల్త్ విభాగం, ఉద్యానవనాలను అందంగా తీర్చిదిద్దే గార్డినర్స్, శానిటరీ మేస్త్రీ, స్వీపర్లు, క్యాటరింగ్ సూపర్వైజర్లు, ఇంజినీరింగ్ తదితర విభాగాలలోని సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో కిందిస్థాయి సిబ్బంది లేకపోవడంతో టెండర్ల ప్రక్రియ, జరిగిన పనులకు వేగవంతంగా బిల్లుల చెల్లింపు వంటి పనుల్లో జాప్యం నెలకొంటోంది. సమర్థులైన అధికారులు పదవీవిరమణ చేయడంతోనూ ఇంజినీరింగ్ విభాగంలో పనులకు ఆటంకం కలుగుతోంది.
\జనరల్ విభాగంతో పాటు అన్ని విభాగాల్లో అటెండర్లది కీలకపాత్ర. వీరి కొరత టీటీడీ అధికారులను వేధిస్తోంది. ఇక, రిటైర్మెంట్లు జరుగుతూ.. నియామకాలు లేకపోవడం తో పాలనాపరమైన బాధ్యతల నిర్వహణ భారంగా మారుతోంది. ఈ క్రమంలో కొత్త నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వాలని టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకుడు మల్లారపు నాగార్జున డిమాండ్ చేశారు. తద్వారా ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించాలని ఆయన కోరారు.