హైదరాబాద్ :
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. మంగళవారం సాయంత్రం తర్వాత మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే వైద్యులు ప్రకటించడానికి ముందుగానే ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆస్పత్రి బయటకు వచ్చి, ”గురువు గారు ఇక లేరు, కాసేపట్లో బాడీని ఇంటికి తీసుకెళ్తున్నాం” అని కన్నీటి పర్యంతమై చెప్పారు.
కళ్యాణ్ దాసరికి అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి కావడంతో ఏం జరిగిందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. గతంలో ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత వారం రోజుల క్రితం దాసరి నారాయణరావు మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయన అన్నవాహికకు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశామని, ఆ తర్వాత ఆయన మూత్రపిండాలలో సమస్య ఏర్పడిందని వైద్యులు తొలుత విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ప్రకటించారు.