కోల్కతా: బాలికను వేధిస్తున్న యువకులను అడ్డుకున్న ఓ వ్యక్తి చేతిని వారు నరికేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమ బెంగాల్లో ఈ దారుణం జరిగింది. ముర్షిదాబాద్ జిల్లా ధామలిపారా గ్రామానికి చెందిన జహంగీర్ ఆలం మేనకోడలను మోదిల్ షేక్ లైంగికంగా వేధిస్తున్నాడు.
గురువారం ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించిన జహంగీర్ అడ్డుకున్నాడు. దీంతో షేక్ తన సహచరులతో కలిసి ఆయనపై దాడి చేయడంతో పాటు చేతి మణికట్టును నరికివేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.