స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్సీ దృష్టికి సమస్యలు, వినతిపత్రం సమర్పణ…
ప్రభుత్వ విచారణ చేయిస్తామని ఎమ్మెల్సీ మాధవ్ వెల్లడి…
టీంఫని స్కూల్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయిస్తామని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పి.వీ. ఏన్.మాధవ్ ప్రకటించారు. ఇటీవల టీంఫని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆ పాఠశాలలో జరుగుతున్న అక్రమాలపై తనకు ఫిర్యాదు చేశారని, ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని ఒక వినతిపత్రాన్ని సమర్పించినట్లు ఆయన తెలియజేశారు. పాఠశాలలో ఫీజులను పేరెంట్స్ అసోసియేషన్ తో సంప్రదించకుండా ఈ విద్యా సంవత్సరంలో భారీ మొత్తంగా పెంచారని విద్యార్థుల తల్లిదండ్రులు వారు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారని తెలిపారు. ఇంతే కాకుండా పాఠశాల చైర్మన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, సరైన కారణం లేకుండా బోధన, బోధనేతర సిబ్బందిని తొలగించారని వినతి పత్రంలో పేర్కొన్నట్లు ఎమ్మెల్సీ మాధవ్ తెలియజేశారు. ఈ సమస్యలపై పాఠశాల చైర్మన్ తో మాట్లాడుతానని సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియ పరిచినట్లు ఆయన తెలియజేశారు.
టీంఫని స్కూల్ అక్రమాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ కు దగ్గరలో ఉన్న సి.బి.ఎమ్ ప్రాంతంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న టీంఫని స్కూల్ లో కొంతకాలంగా అడ్డగోలు వ్యవహారాలు నడుస్తున్నాయని స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ఎక్కువ మొత్తం వసూలు చేసి ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న సంస్థలకు కోట్లాది రూపాయలు తరలించారని ఆరోపించారు. స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తో ఎటువంటి సంప్రదింపులు, సమాలోచనలు, ముందస్తు సమాచారం లేకుండా ఈ ఏడాది విద్యార్థుల స్కూల్ ఫీజులను 30 శాతం పెంచేశారని వివరించారు. ఇంతే కాకుండా టీచర్లను, సహాయక సిబ్బందిని సరైన కారణాలు లేకుండా కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తూ తొలగించడం చేశారని పేర్కొన్నారు. దీనంతటికీ టీంఫని స్కూలు చైర్మన్ డాక్టర్ కెన్ ముఖ్య కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ నియమ నిబంధనల ప్రకారం ఆదాయ నిధులను తరలించ కూడదని ఉన్నప్పటికీ దానికి భిన్నంగా చైర్మన్ వ్యవహరించారని తెలిపారు. స్కూలు అవసరాలకు ఉపయోగించే ఆవరణలో ఉన్న స్థలంలో అక్రమంగా ఒక చర్చి నిర్మించారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో టీంఫని స్కూలుకు వుడా ఇచ్చిన భూముల్లో ఆ సంస్థే విద్యాలయం నడపవలసి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా అందులో కొంత భాగాన్ని వేరే విద్యా సంస్థకు లీజుకు ఇచ్చినట్లు తెలియజేశారు. ప్రస్తుతం పాఠశాల చైర్మన్ డాక్టర్ కెన్ తన కుటుంబ సభ్యులను స్కూల్ బోర్డులో డైరెక్టర్లు గా నియమించుకుని తానే దీర్ఘకాలంగా చైర్మన్ గా కొనసాగుతున్నారని ఆరోపించారు. వీటన్నిటిపైన జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా వివరించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్నట్లు తెలిపారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ కెన్ తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని విధుల నుంచి అన్యాయంగా తొలగిస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులను స్కూలు ఆవరణలోకి రానివ్వడం లేదని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వ పరంగా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు హామీ ఇచ్చినట్లు పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు.