దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం అతి ప్రాచీనమైనది. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ విశాఖపట్నం నగరానికి 11 కి.మీల దూరంలో తూర్పు కనుమల్లోని సింహగిరిపై సముద్రమట్టానికి 800 అడుగుల(244మీ)ఎత్తున ప్రశాంత వాతావరణంలో శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశారు. సింహాచలం ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా ఉంది. విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే వరాహ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ (మే నెలలో) వస్తుంది.
ఆలయ చరిత్ర-స్థల పురాణం
స్వయంభూవైన సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి ఇక్కడ 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం బట్టి తెలుస్తోంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్ప కళ, అందమైన గోపురాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. ఆలయంలో పలు చారిత్రక సందర్భాల్లో వేసిన శిలా శాసనాలు చారిత్రక పరిశోధకులను ఆకర్షిస్తాయి. సత్యకాలంలో వేదాలు అపహరించిన హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహ అవతారం, ఆ తర్వాత యుగంలో హరి ద్వేషంతో.. భక్తులను హింసించిన హిరణ్యకశిపుని వధించిన నృసింహావతారాల కలయికగా.. స్వామి ఇక్కడ వరాహ నృసింహ స్వామిగా స్వయం వ్యక్తమయ్యారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజూ నాలుగు వేదాలు, నాలాయిర దివ్య ప్రబంధాలు, పురాణాలు స్వామి వారి సన్నిధిలో పారాయణ చేస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (రూ.52 కోట్లు)కలిగిన దేవాలయమిదే. ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు ఏడాదిలో 364 రోజులు సుగంధ భరిత చందనంతో కప్పబడి ఉంటారు. భక్తులకు నిత్యం దర్శనం ఇచ్చేది.. ఈ చందన అవతారంలో వుండే స్వామి వారే. ఏటా ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే.. అర్థరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ ఆ నిజరూప దర్శనం ఉంటుంది. స్వామి వారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరిగే ఉత్సవం. మిగతా సమయాల్లోనూ ఎంతో రద్దీగా ఉండే సింహాచలం ఆలయం ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బంగా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చే లక్షల మంది భక్తులతో మరింత రద్దీగా మారుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్జిత సేవలు ఉంటాయి. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకొని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయనేది భక్తుల విశ్వాసం