Happy Raksha Bandhan రక్షా బంధనము – వాస్తవిక అర్థము Sister BK Lalitha Vizagvision
రక్షా బంధనము – వాస్తవిక అర్థము
రక్షా బంధన పర్వము ప్రతి సోదరీ సోదరుల హృదయాలలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఎందుకంటే ఆ రోజున వారు తమ పవిత్ర బంధాన్ని పునరుద్ఘాటిస్తారు.
రక్షా బంధనము అంటే రక్ష కలిగించే బంధనము అని అర్థము. ఆచారం ప్రకారం సోదరీమణులు తమ సోదరుని నుదుటన తిలకం పెట్టి, చక్కటి రాఖీని చేతికి కడ్తారు. తమ ప్రేమకు గుర్తుగా వారికి మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు తిరిగి తన ప్రేమను చాటుకుంటూ ఎట్టి పరిస్థితిలోనూ తన సోదరికి రక్షణ కల్పిస్తానని మాట ఇస్తాడు. అంతేకాక తన ప్రేమకు గుర్తుగా బహుమానం కూడా ఇస్తాడు.
రక్షా బంధన పర్వంలో ఎంతో నిగూఢమైన ఆధ్యాత్మిక భావం దాగి ఉంది. మనమంతా ఆత్మలమని, ఆ పరమాత్ముని సంతానమని గుర్తు చేసే పండుగ ఇది. ఆత్మ-పరమాత్మల పవిత్ర బంధాన్ని సోదరి-సోదరుడి పవిత్ర బంధంతో ముడిపెట్టి చూపించడం జరిగింది. తిలకము అంటే స్వయంలోని ఆత్మిక స్థితిని జాగృతి చేసే ఆచారము అనగా నేను ఒక ఆత్మను, చైతన్య శక్తిని, నేను ఈ స్థూల శరీరమును కాదు అని చెప్తుంది. అలాగే తిలకము విజయానికి కూడా సూచకము. విజయము అంటే మనిషికి అనాదిగా ఉన్న శత్రువు – వికారాలపై అంటే కామ క్రోధ మోహ లోభ అహంకారాలు అనే వికారాలపై విజయం సాధించడము అని అర్థము. రాఖీని కట్టడము అంటే త్రికరణ శుద్ధిగా పవిత్రతను ఆచరించడాన్ని సూచిస్తుంది. మనం వికారాలకు వశమై చెడు కర్మలు చేసినప్పుడే కష్టాలను ఎదుర్కొంటాము. కర్మ మంచిదైనా చెడ్డదైనా – ఏ కర్మ కూడా ఫలితం లేకుండా ఉండదు. భగవంతుడా! మేము మా ఆలోచనల్లో, మాటల్లో మరియు కర్మల్లో ఎటువంటి వికారాల అంశను రానివ్వము అని దేవునితో ప్రతిజ్ఞ చేసినప్పుడు భగవంతుడు మనపై దివ్య జ్ఞానమును కురిపించి మన సంరక్షకుడిగా, ముక్తి ప్రదాతగా నిలుస్తారు. మనకు అంతులేని సుఖశాంతులను ప్రసాదిస్తారు. వారి ఛత్రఛాయలో మనం నిజంగా సురక్షితంగా ఉండగలము.నోరు తీపి చేసుకోవడము అంటే వికారాలపై విజయాన్ని సాధించినదానికి గుర్తు. ఆత్మిక స్థితిలో ఉంటూ భగవంతుడికి చేసిన ప్రతిజ్ఞను పునరుద్ఘాటించినప్పుడు మనం ఈ భువిపై పవిత్రత, శాంతి, సమృద్ధి నిండిన ప్రపంచాన్ని తీసుకురాగలము. రక్షాబంధనము జరుపుకునే అసలైన భావము ఇది.