టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారికి శుక్రవారం లక్ష కుంకుమార్చన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి విడత కుంకుమార్చన నిర్వహించారు. ఆ తరువాత నైవేద్యం, హారతి ఇచ్చారు. తిరిగి సాయంత్రం 4.00 నుంచి 6.00 గంటల వరకు రెండో విడత కుంకుమార్చన చేపట్టారు. అనంతరం నివేదన, దీపారాధన, హారతి, తీర్థప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించనున్నారు. కుంకుమార్చనసేవలో పాల్గొన్న గృహస్తులకు ఒక లడ్డూ, కుంకుమ ప్రసాదం బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు