తిరుమల శ్రీవారి భక్తులపై జీఎస్టీ భారం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయమై టీటీడీతో కలిసి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలిని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల తొలిరోజు శనివారం రాత్రి సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం హోదాలో ఇప్పటి వరకు 11 సార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించానని చెప్పారు.
దీనిని అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. 2003లో అలిపిరి ప్రమాదంలో సాక్షాత్తు తిరుమలేశుడే కాపాడారని చెప్పారు. ప్రపం చ వ్యాప్తంగా హిందువులు ఆరాధించే ఏకైక దైవం వేంకటేశ్వర స్వామేనని చెప్పారు. ఈ క్షేత్ర పవిత్రతను కాపాడానికి టీటీడీ, ప్రభుత్వం కృషి చేస్తాయన్నారు. తిరుమలనే కాకుండా తిరుపతిని కూడా స్మార్ట్, గ్రీన్ సిటీగా తయారు చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. అంతకుముందు తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద టీటీడీ ప్రధాన అర్చకులు.. ముఖ్యమంత్రి తలకు పరివట్టం చుట్టగా ఈవో సింఘాల్ శేషవస్త్రాన్ని ధరింపచేశారు.
ఆ తర్వాత సీఎం నూతన పట్టువస్త్రాలు ఉంచిన వెండిపళ్లేన్ని తలపై ఉంచుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. సన్నిఽధిలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం, 2018 నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీని ఆవిష్కరించారు. టీటీడీ ఆన్లైన్ తెలుగు వెబ్సైట్ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఈ పట్టువస్త్రాలను ఈ నెల 27న జరిగే గరుడ సేవలో స్వామికి అలంకరించనున్నారు.
వైభవంగా ధ్వజారోహణం
శ్రీవారి ఆలయంలో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నాందిగా ధ్వజస్తంభంపై గరుడపటాన్ని ఎగురవేశారు. అంతకుముందు ఆలయంలో నిత్యపూజాది కార్యక్రమాలనంతరం ఉభయనాంచారీ సమేతుడైన మలయప్పస్వామి బంగారు తిరుచ్చిలో మాడవీధుల్లో ఊరేగారు. ధ్వజపటాన్ని కూడా ఊరేగిస్తూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు వేంచేయాల్సిందిగా అష్టదిక్పాలాది దేవతలందరికీ ఆహ్వానం పలికారు. సాయంత్రం 5.58 గంటల నుంచి 6 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ నిర్వహించారు. అజ్ఞాత భక్తుడు కానుకగా అందించిన మూడు వజ్రహారాలను కూడా మలయప్ప స్వామి, దేవేరులకు అలంకరించారు.
పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు శనివారం రాత్రి పెద్ద శేష వాహన సేవ నిర్వహించారు. ఉభయ నాంచారులతో కూడిన మలయప్పస్వామి పెద్ద శేష వాహనంపై మాడవీధుల్లో ఊరెరిగారు. శేష వాహనానికి ముందు సాంస్కృతిక కళారూపాలు నిర్వహించారు.