VIZAGVISION:Musical Fountain Vuda City Central Park, Visakhapatnam….అక్కడ లయాన్విత సంగీతానికి రివ్వున ఎగిరే నీటి చిమ్మెన గంతులేస్తుంది…! దేశభక్తి గీతానికి సలాం చేస్తున్నట్టు తాడెత్తు ఎగిసిన నీటి తుంపర్లు వినమ్రంగా నేలవైపు వంగుతాయి…! ఇంద్రధనసు లాంటి రంగుల కాంతుల్లో చిందేసే జల కన్యలా ఉంటుంది ఆ ఫౌంటెన్. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అతి పెద్ద నగరమైన విశాఖలోని సెంట్రల్ పార్క్‌లోని మ్యూజికల్ ఫౌంటెన్ పెద్ద పర్యాటక ఆకర్షణగా మారింది.
ఒకనాటి విశాఖ కేంద్ర కారాగారాన్ని విశాఖ నగరాభివృద్ధి సంస్ధ (వుడా) అధునాతన హంగులతో సిటీ సెంట్రల్ పార్క్‌గా రూపొందించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌కి అతి చేరువలో ఉండడంతో పర్యాటకుల సందర్శనకు ఈ పార్క్ మరింత ఉపయుక్తంగా ఉంది. ముఖ్యంగా ఈ పార్క్‌లో భారత దేశంలోనే అతి పొడవైన మ్యూజికల్ ఫౌంటెన్‌గా నిలుస్తోంది. చైనాకు చెందిన ఓరియంట్ సంస్ధ సహకారంతో మొత్తం 4.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఫౌంటెన్‌ను ఏర్పాటుచేశారు. క్రమక్రమంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ముఖ్య ప్రదేశాల్లో ఒకటిగా ఎదుగుతున్న విశాఖలో పర్యాటక ఆకర్షణలను పెంచేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సెంట్రల్ పార్క్ మ్యూజికల్ ఫౌంటెన్‌ను తిలకించేందుకు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల వాసులతోపాటు గుజరాత్, ఒడిశా, చత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల పర్యాటకులు వస్తున్నారు. సాయం సంధ్యలో నగరం మధ్యలో ఈ ఆకర్షణ ఉండడంతో సులువుగా పర్యాటకులు ఈ వినోదాన్ని తిలకిస్తున్నారు. సాయంత్రమైతే పర్యాటక యువత, చిన్నారులు ఈ ఫౌంటెన్ వెలుగుల్లో ఆహ్లాదాన్ని అమితంగా అందుకుంటున్నారు.