VIZAGVISION:Come to Birthplace & Partners in Development,AP CM Chandra babu in DUBAI…జన్మభూమికి రండి, అభివృద్ధిలో భాగస్వాములు కండి
దుబాయి ఏపీ ఎన్నార్టీ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుప…
దుబాయి, అక్టోబర్ 21: రాష్ట్రంలో మూడేళ్ల నాడు మీమీ గ్రామాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మేమెలా మార్చేవేశామో వెళ్లి బేరీజు వేసుకోండి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
గల్ప్ లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులను కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాలను అధునాతనంగా,ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి ప్రవాసాంధ్రుడు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అమెరికాలో మూడు రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు నాయుడు శనివారం గల్ఫ్ పర్యటనకు దుబాయ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్ర తెలుగు వారి సంస్థ (ఎన్.ఆర్.టి) సమన్వయకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. సంక్షోభ కాలంలో అధికారంలోకి వచ్చి సమస్యల సుడిగుండం నుంచి రాష్ట్రాన్ని నెమ్మదిగా బయటికి తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. విభజన నాడు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ఏడాదికే మిగులు విద్యుత్తు ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. రూ.16 వేల కోట్ల ద్రవ్యలోటుతో నవ్యాంధ్ర ప్రయాణం ఆరంభమైందని, అన్ని సమస్యలను అధిగమిస్తూ కేంద్ర సహాయంతో ముందుకు వెళుతున్నామని చంద్రబాబు వివరించారు. 2029 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు స్వర్ణాంధ్ర విజన్ రూపొందించి పనిచేస్తున్నామన్నారు. ప్రపంచంలోని ఐదు అత్యంత ఉన్నత నగరాలలో ఒకటిగా రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మిస్తామన్నారు. ఇప్పటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కొనసాగించాలంటే రాష్ట్రానికి మరోసారి సుస్థిర ప్రభుత్వ అవసరం ఉందని, అందరూ తనకు సహకరించాలని కోరార. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల్లో 27 వేల పైచిలుకు మెజారిటీ సాధించి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలను తిప్పికొడుతూ ఓటర్లు గట్టి తీర్పునిచ్చారని, 80% ప్రజలు తృప్తితో, తమ పరిపాలనపై సంతప్తితో తమకు అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు తాను ఒక పక్క ముఖ్యమంత్రినని, మరోపక్క పార్టీ అధ్యక్షుణ్ణని, రాష్ట్రానని ఎంత బాగా అభివృద్ధి చేసినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకు మద్దతుగా నిలవని పక్షంలో రాష్ట్రం కష్టాల్లో పడుతుందని చంద్రబాబు చెప్పారు.
‘మీరు డబ్బులు వెచ్చించాలని అడగడం లేదు. మీ ప్రాంత అభివృద్ధి కోసం తగిన సలహాలు, ఉత్తమ పద్ధతులు, సాంకేతికతను తీసుకురావాలి, నిధుల కంటే ఆలోచనలు అత్యంత ముఖ్యం. ప్రభుత్వం గ్రామాభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తుంది. ప్రభుత్వానికి సహకరించడమే మీ పని.
నాయకత్వం వహించి మీ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం ఇవ్వండి. గ్రామాల అభివృద్ధి కోసం ఫైబర్ నెట్, డ్రోన్లు వంటి అధునాతన సాంకేతికతను, పరికరాలను ఉపయోగిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవాసాంధ్రలకు పిలుపునిచ్చారు.
అమరావతి రూపంలో ఒక సుందర నగరంగా రాజధానిని తీర్చిదిద్దే అవకాశం వచ్చిందని చెబుతూ ఎడారిలా ఉన్న దుబాయ్‌ని అంతా కలసి భూతల స్వర్గంగా మార్చారని, అదే తమకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఇక్కడ నీళ్లు లేవు, ఉష్ణోగ్రతలు ఎక్కువ, నివాసయోగ్య వాతావరణం ఉండదు, అయినా మీరంతా కష్టపడి ఈ దేశ రూపురేఖలు మార్చారు’ అని ప్రశంసించారు. ‘ఇక్కడ 50 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి.చమురు, సముద్రం తప్ప ఏమీ లేదు. ఆ ఉప్పునీటిని మంచినీటిగా మార్చాలి. విద్యుత్తు లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఉన్న దుబాయిని స్వర్గంగా చేశారు. ఇదొక సంకల్పం తప్ప మరొకటి కాదు’ అని చంద్రబాబు అన్నారు. ‘మీరు కష్టపడి ఇక్కడి నుంచి మీ మీద ఆధారపడిన మీ వాళ్లకు డబ్బు పంపిస్తున్నారు’ అంటూ ప్రశంసించారు. మన రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాలో విదేశాల్లో ఉన్న మనవాళ్లు 25 లక్షలమంది ఉన్నారని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనవాళ్లున్నారని, ఉన్నత స్థానాలకు ఎదిగారని, ఇది తనకు ఎంతో గర్వకారణం గా ఉందని చంద్రబాబు కొనియాడారు. ప్ర
‘ప్రతి 20 మందిలో ఒకరు విదేశాల్లో ఉన్నారని, అన్ని కంపెనీల్లో పనిచేస్తున్నారని, అది మన శక్తి, మన తెలివి తేటలన్నారు. ఇక్కడ అవకాశాలు వచ్చాయి. చాలా మంది చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారున్నారు.
గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసాలకు గురై బాధపడుతున్నవారున్నారు. నేనొక్కటే ఆలోచన చేశాను. ఏపీలో ఉండే తెలుగువారే కాకుండా మన తెలుగువారు ఎక్కడ ఉన్నా వాళ్లందరికీ నేను ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా వారిని ఆదుకోవాలని నిశ్చయించాను. డబ్బులు ముఖ్యం కాదు. మనవాళ్లకు బ్రహ్మాండమైన తెలివితేటలు, శక్తి , సామర్ధ్యం ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుందాం. అనేక దేశాల్లో ప్రవాసాంధ్రులున్నారు. 109 దేశాల్లో ఏపీ ఎన్నార్టీలోకి 45,000 మంది వచ్చారు. మన తెలుగు సంఘాల వారు సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ పండుగలు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పండుగలు జరుపుతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటోంది. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏపీ ఎన్.ఆర్.టీ మీ అందరినీ సంఘటితపరిచే శక్తి. తెలుగువారికి ప్రపంచంలో ఎక్కడా అన్యాయం జరగకుండా చూస్తుంది. ఇప్పటికే చాలా సంఘాలు పనిచేస్తున్నాయి. ఏపీ ఎన్నార్టీ ప్రభుత్వ సంస్థ’అని చంద్రబాబు తెలిపారు. తాను అధికారం చేపట్టాక
రాజధాని లేదు. పరిశ్రమలు లేవు. విశ్వశ్రేణి విద్యాసంస్థలు, విజ్ఞాన సంస్థలు లేవని వివరించారు.