VIZAG VISION:Heavy Rains Kerala & Tamil Nadu Due To Cyclone at Sabarimala Devotees,కేరళలో ఓక్కి తుపాను విజృంభిస్తోంది. శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన వేలాదిమంది భక్తులు ఓక్కి తుపాను ధాటికి విలవిల్లాడుతున్నారు. తుపాను ప్రభావం చాలా ఎక్కువగా ఉండడంతో భక్తులను అడవి మార్గం గుండా ప్రయాణించవద్దని ట్రావెన్కోర్ బోర్డు ప్రకటించింది.
ముఖ్యంగా ఎరుమేలి-పంబా, సథరం-పులిమేడు మార్గాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని టీడీబీ తెలిపింది. సన్నిధానం చుట్టూ ఉన్న ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో పెనుగాలులు వీస్తున్నాయని, అలాగే వర్షం కూడా కురుస్తోందని అధికారులు తెలిపారు.
పంబానది కూడా ఉధృతంగా ప్రవహిస్తోందని, భక్తులెవరూ నదిలోకి దిగి స్నానాలు చేయవద్దని అధికారులు ఆదేశించారు.
అలాగే భక్తులు ఓకి తుపాను తగ్గే వరకూ రక్షణ ప్రాంతంలో ఉండాలని టీడీబీ పేర్కొంది.
ఇదిలా ఉండగా ఎరుమేలి-కరిమల-సన్నిధానం మార్గం అత్యంత ప్రమాదకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మార్గంలో గాలుల ధాటికి పెద్దపెద్ద వృక్షాలు కూలిపోయాయని వారు అంటున్నారు. పంబదగ్గరున్న త్రివేణి పార్కింగ్ ప్రాంతం మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. ఇక్కడ పార్కింగ్‌లో ఉన్న వాహనాలు సైతం నీటిలో పూర్తిగా మునిగిపోయాయి.
శబరిమలలో ఏపీ పోలీసులకు తీవ్రగాయాలు
శబరిమల సన్నిధానం సమీపంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 14మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎనిమిదిమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
కాగా వీరంతా శబరిమలలో విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని కేరళ ఆర్టీసీ బస్సు వేగంగా ముందు నుంచి ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పోలీసుల వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.