Vizag Vision:Sri Krishnadevaraya Mahotsavam in Ghantasala Mandalam,Krtishna Dist…
. ఘంటసాల మండలం శ్రీకాకుళం లో శ్రీ కృష్ణదేవరాయ మహోత్సవం..2018(తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు) ప్రారంభం.
భాష, సంస్క్రతి, సంప్రదాయాలతోనే దేశాభివృద్ధి
* భాషపై పట్టు సాధిస్తే గౌరవంతో పాటు ప్రతిష్ట పెరుగుతుంది
* తెలుగు భాషా బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి వెంకటరమణ
భాష, సంస్కృతి, సాంప్రదాయాలతోనే దేశాభివృద్ధి జరుగుతుందని, పరాయి భాష మాత్రం కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ అన్నారు. శ్రీకృష్ణదేవరాయుల-2018 తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని కృష్ణాజిల్లా శ్రీకాకుళంలోని ఆంధ్రమహావిష్ణు దేవాలయం శనివారం నిర్వహించిన తొలి రోజు కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు తమ మాతృభాషలోనే అభివృద్ధి చెందాయన్నారు. జపాన్, దక్షిణ కొరియాలాంటి దేశాల్లో ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఇంగ్లీషు ప్రాధాన్యత అవసరం లేదని వారి భాషలకే ప్రాధాన్యతనిస్తారన్నారు. అలాంటి సమయంలో ఇంగ్లీషు అనేది ప్రాపంచిక భాష కాదని, స్థానిక భాషల ద్వారా కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు దేశాభివృద్ది కూడా సాధించవచ్చనే విషయాన్ని అబివృద్ది చెందిన దేశాలు నిరూపించాయని జస్టిస్ వెంకటరమణ తెలిపారు. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కలిగిన భారతదేశం 125 కోట్ల జనాభా కలిగి ఉండి అనేక మాండలికాలు, వేలాది భాషలతో భిన్నత్వంలో ఏకత్వంగా సాధిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కేవలం ఇంగ్లీషు నేర్చుకోవడంతోనే ఉన్నతస్థాయికి వెళతామనేది అపోహా మాత్రమేనని, మాతృభాషతో కూడా ఎనలేని కీర్తి సాధించిన ఘనత తెలుగు జాతికి ఉందన్నారు. తెలుగు భాష అనేది భాష కాదని ఇది ఒక నాగరికత అని దీనితో సహజీవనం వలన స్పూర్తిదాయకమైన ప్రభావం తెలుగు వారిపై ఉంటుందన్నారు. భాషపై పట్టు సాధిస్తే గౌరవంతో పాటు ప్రతిష్ట పొందవచ్చునన్నారు. తెలుగు భాష ఔనత్వానికి కొన్ని అవరోదాలు ఉన్నాయని దీనిని అధిగమించి పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత తెలుగువారందరిపైనా ఉందన్నారు. తాను హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినప్పటికి కేవలం ఒకే ఒక వ్యాసం తెలుగు భాషపై వ్రాయడం ద్వారా గుర్తింపు వచ్చిందని, అలాంటి భాషను పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు తల్లిని, మాతృ భాషను గౌరవించే విధంగా జీవన విధానం సాధిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోగలమని జస్టిస్ వెంకటరమణ పేర్కొన్నారు.
ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ రాచ భాషగా తెలుగు భాషను విశేష గుర్తింపు ఇచ్చిన ఘనత శ్రీకృష్ణదేవరాయులకే దక్కిందన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి పేరున తెలుగు భాష బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం శుభపరిణామమన్నారు. అనేక జాతులు, భాషలు ఉన్నప్పటికి తెలుగు భాషకు ఒక్కడే దేవుడు ఉన్నాడని, ఆయనే ఆంధ్రమహా విష్ణువుగా తెలిపారు. 2018ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు భాష పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించిన నేపద్యంలో రెండు రోజుల పాటు తెలుగు భాష బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ భాషాభిమానులు తెలుగు భాష బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ద్వారా భాషా ఔనత్యం సాధించుకోవచ్చునన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు పేర్కొందిన దేశంలో తెలుగు భాషకు కృష్ణదేవరాయ మహోత్సవం లాంటి సదస్సులు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రముఖ సినీ గేయ రచయితీ సిరివెన్నల సీతారామశాస్త్రీ మాట్లాడుతూ అతి ప్రాచీనమైన తెలుగు భాషకు మూడు స్థాయిలు ఉన్నాయన్నారు. ప్రాకృతమైనదిలో ప్రాధమిక భాషగాను, సాంఘిక స్థాయిలో ఒక సమూహం సమాజంగా మారినప్పుడు, భాష, యాస గుర్తించబడిన స్థాయిలో బావజాలం అందించడంతో పాటు భాష యొక్క గొప్పతనం తెలిపే స్థాయిలను వివరించారు. ఈ సందర్బంగా దేశ భాషలందు తెలుగు లెస్స పరిశోధనాత్మక వ్యాససంపుటి, తెలుగు రాష్ట్రాల్లో భాషాసంక్షోభం ఆచార్య గార్లపాటి ఉమామహేశ్వరరావు రచన, ద్రావిడ మంగోలు భాషల జన్యుసంబంధాలు ఆచార్య గార్లపాటి ఉమామ హేశ్వరరావు రచన, శ్రీకాకుళాంధ్ర మహాదేవ సుప్రభాతం డాక్టర్ పి.టి.జి.వి.రంగాచార్యులు రచన, తెలుగులో అతిధి పదాలు డాక్టర్ జి.వి.పూర్ణచందు సంకలనం, సూతరంగస్థలి సిద్దాంత పత్రం డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచన, పద్య కవితా బ్రహ్మోత్సవం కవితా సంపుటాలను న్యాయమూర్తి ఎన్.వి.రమణ, ఉపసభాపతి, జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. తొలుత న్యాయమూర్తి శ్రీకృష్ణదేవరాయల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కవులు, కళాకారులు, తెలుగు భాషా అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.