Vizag Vision Visakhahapatnam: మణిహారం.. భోగాపురం విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభోత్సవ వేడుకలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి*విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మితమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనుందని, ఆగస్టు 1న జరగనున్న ప్రారంభోత్సవ వేడుకను చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్ మీటింగు హాలులో హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమీక్షలో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న ఆయన అనంతరం కలెక్టరేట్ వీసీ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో భోగాపురం ఎయిర్ పోర్టు కు సంబంధించిన వివరాలను హోం మంత్రి అనితతో కలిసి వెల్లడించారు.*ఉత్తరాంధ్ర నుంచి భారీగా ప్రజల భాగస్వామ్యం*భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి సుమారు లక్ష మంది, ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు మూడు లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రజల భద్రత, సౌకర్యం, రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. విశాఖపట్నం నగరానికి దూరంగా విమానాశ్రయం నిర్మించారనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నప్పటికీ, భవిష్యత్ జనాభా పెరుగుదల, ప్రాంతీయ విస్తరణ, అంతర్జాతీయ విమానయాన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక దృష్టితో ఈ ప్రాజెక్టును నిర్మించినట్లు స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భోగాపురం విమానాశ్రయం నిర్మితమైందని పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాలను తీర్చడమే కాకుండా భవిష్యత్ తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారని, సందర్శించే ప్రతి ఒక్కరికీ దాని విస్తృతి, నాణ్యత, భవిష్యత్ దృష్టి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఉత్తరాంధ్రను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లే కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుగా ఈ విమానాశ్రయం నిలుస్తుందని అన్నారు.*ఉత్తరాంధ్ర సంస్కృతికి అద్దం పట్టే సాంస్కృతిక కార్యక్రమాలు*ప్రారంభోత్సవ వేడుకల్లో ఉత్తరాంధ్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రసిద్ధ థింసా నృత్యంతో పాటు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కేవలం ఒక మౌలిక వసతుల ప్రాజెక్టు ప్రారంభం మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో కొత్త అధ్యాయానికి నాంది అని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.*అసిప్ సెమీ కండెక్టర్ టెక్నాలజీ సంస్థకు శంకుస్థాపన*విశాఖపట్టణం వేదికగా ఏర్పాటు కానున్న ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన అసిప్(ASIP) టెక్నాలజీస్ సెమీ కండక్టర్ సంస్థకు ఆగస్టు 01న ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని పల్లా శ్రీనివాసరావు వివరించారు. ఆ రోజు ఎయిర్ పోర్టుతో పాటు, ఏవియేషన్ హబ్ – యూనివర్శిటీ, ఎడ్యుసిటీలు, జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రారంభమవుతాయని, వాటితో పాటు అసిప్ టెక్నాలజీ సంస్థకు శంకుస్థాపం కూడా జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సీపీ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు……