Vizagvision :

దేశ ప్రగతి ఎంత ముఖ్యమో… ప్రజల ఆరోగ్యం అంతే ముఖ్యం

• పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే
• గ్రీన్ బెల్ట్ నిర్వహణ, శబ్ద కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి
• కాలుష్యాన్ని నియంత్రించి గోస్తని నదిని కాపాడుదాం
• కాలుష్య నియంత్రణ మండలి తనిఖీల్లో బాధితులను భాగస్వామ్యం చేయాలి
• కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో… ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్ర్త సాంకేతికల శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే చూస్తూ నిబంధనలను పక్కనబెట్టి జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లడం సరికాదన్నారు. పరిశ్రమలు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని, శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు కచ్చితంగా పాటించాలని అన్నారు. మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి కేవలం నివేదికలకే పరిమితం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “కొన్ని ప్రాంతాల్లో జనావాసాలకు అత్యంత సమీపంలో మైనింగ్ కోసం పేలుళ్లు చేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామని, పేలుళ్లు దాటికి ఇళ్లకు బీటలు వారి ఆర్థికంగా నష్టపోతున్నామని బాధితుల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన పర్యావరణ ప్రమాణాలను అన్ని మైనింగ్ సంస్థలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
• బాధితుల భాగస్వామ్యంతో పరిష్కార మార్గాలు
కాలుష్క నియంత్రణ మండలి తనిఖీ ప్రక్రియ ప్రజలకు అర్థం కాకుండా ఒక బ్రహ్మ పదార్థంలాగా మారిపోయింది. దీంతో క్షేత్ర స్థాయిలో కాలుష్య సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు బాధితులను కూడా తనిఖీ కమిటీలో భాగస్వామ్యం చేస్తే… తనిఖీలు పారదర్శకంగా జరగడంతోపాటు బాధితులకు న్యాయం జరుగుతుంది.
• ఎవరికీ మినహాయింపులు లేవు
శబ్ద కాలుష్యం నియంత్రణలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు, కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనలు పరిశ్రమలు, సంస్థలు, ప్రార్థనా మందిరాలు కచ్చితంగా పాటించాలి. ఇండస్ర్టియల్, కమర్షియల్, రెసిడెన్సియల్, సెన్సిటివ్ జోన్లలో నిర్దేశిత డెసిబెల్ పరిమితులను కచ్చితంగా పాటించాలి. ప్రార్థనా మందిరాలైనా జోన్ల వారీగా నిర్దేశించిన శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాల్సిందే… ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు.
• వైట్ కేటగిరి పరిశ్రమలు కూడా కాలుష్యం వెదజల్లుతున్నాయి
నెల్లూరు జిల్లాలో కొన్ని పరిశ్రమలు వైట్ కేటగిరి కింద రిజిస్టర్ అయి, నిబంధనలకు విరుద్ధంగా దుర్వాసన, కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. బయటకు అస్సలు కాలుష్యం కలిగించని పరిశ్రమలు అని చెప్పుకుంటూ ఆర్గానిక్ వేస్ట్, రసాయన వ్యర్ధాలను బయటకు వదులుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపి పరిశ్రమల నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే సాంకేతికతను వాడి దుర్వాసన తగ్గించే పద్ధతులను పాటించేలా చేయాలి.
• కాలుష్య కోరల్లో గోస్తనీ నది
గోస్తనీ నది తీవ్రమైన కాలుష్యం బారిన పడింది. పాలకోడేరు మండలం వేండ్ర గ్రామ పరిధిలో సేకరించిన నీటి నమూనాలలో బయోలాజికల్ ఆక్సిజెన్ డిమాండ్ 15 mg/l చేరడం అనేది పర్యావరణ అత్యవసర పరిస్థితిని సూచిస్తోంది. ఈ నమూనాల ప్రకారం కాలుష్యం అనుమతించదగిన స్థాయి కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. పరిశ్రమల నుంచి నేరుగా నదిలోకి వచ్చే మురుగు, రసాయన వ్యర్ధాలను డ్రోన్, వీడియో కెమెరాల ద్వారా రికార్డ్ చేసి సంబంధిత పరిశ్రమలను బాధ్యులను చేయాలి.
• నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం విజయవంతం చేద్దాం
గాలి నాణ్యతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం. దేశంలో అత్యంత కాలుష్యపూరిత నగరాలలో ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాల స్థాయిలను 40 శాతం వరకు తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 13 నగరాలు ఎంపిక చేసి దాదాపు రూ. 400 కోట్ల నిధులను కేటాయించారు. వాటిని జాగ్రత్తగా వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల”ని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరతపై అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకురాగా.. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే సంబంధిత ఫైలును ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.

Related posts

Vizagvision Visakhapatnam:

Vizagvision Visakhapatnam:

Vizag Vision Visakhapatnam శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘం: ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ. టి. జి. భారత్ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ. టి. జి. భారత్ ఈరోజు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ని సందర్శించి సంస్థ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలోని ఒ.పి. డి. మరియు స్పెషాలిటీ విభాగాలను సందర్శించి అక్కడ ప్రజలకు అందిస్తున్న సేవలను సౌకర్యాలను ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆత్మకూరి కృష్ణ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు. గౌరవ మంత్రి ఆసుపత్రి వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ఆత్మకూరు శంకర్ రావు గారి విగ్రహానికి పూలమాల సమర్పించి అంజలి ఘటించారుఈ సందర్భంగా ఆయన శంకర్ ఫౌండేషన్ లో నూతనంగా సమకూర్చుకున్న శ్రీమతి ఆత్మకూరి యశోద విజన్ నాలెడ్జి సెంటర్ ని శ్రీ భరత్ చేతులమీదుగా ప్రారంభించారు. తరువాత నూతనంగా ప్రారంభించిన సెంటర్ లో ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ వేణుగోపాల్,పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఆసుపత్రి గత 29 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను మంత్రిగారికి వివరించారు. తరువాత జరిగిన పాత్రికేయుల సమావేశంలో మీడియా ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఆసుపత్రి యొక్క సేవలను ర్రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని కోరారు మేనేజింగ్ ట్రస్టీ ని కోరారు. ఈ సందర్భంగా అయన ప్రత్యేకంగా ఫాండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు సంస్థ సేవలు అందిచడం గొప్ప విషయమని మరియు రాష్ట్రంలో ప్రఖ్యాత కంటి ఆసుపత్రిల తరహాలో శంకర్ ఫౌండేషన్ సేవలు కూడా ఇంత గణనీయంగా ఉండడం చాలా గొప్ప విషయం అని, ఇటువంటి సంస్థలను ప్రోత్సహించడానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వున్న NDA ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని తెలియచేసారు. సమావేశంలో పాల్గొన్న శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి ఉషా కృష్ణ మరియు మేనేజింగ్ ట్రస్టీ కృష్ణ ఆహ్వానము మేరకు శంకర్ ఫౌండేషన్ కు రావడం జరిగిందని ఇక్కడకు వచ్చిన తర్వాత ఆసుపత్రిని సందర్శించి సేవలను తెలుసుకోవటం చాలా సంతృప్తినిచ్చిందని సంస్థ అందిస్తున్న సేవలకు తన సహకారం ఎల్లపుడు ఉంటుందని తెలియజేసారు.కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ డాక్టర్లు ప్రొఫెసర్ కృష్ణ ప్రసాద్, అజయ్ శర్మ, రవీంద్ర, శిరీష, కృష్ణ సుపర్ణ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్లు శ్రీ బంగార్రాజు, వేణుగోపాల్, కనకరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.