Home UncategorizedVizagvision Bogapuram:

Vizagvision Bogapuram:

by Deva Trinadh Rao

ఎర్ర బస్సు రాని చోటకు ఎయిర్ బస్సా అన్నవారికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమే సమాధానం

  • కూటమిలో మూడు పార్టీలు ఉండడంతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేగవంతం
  • ఈ అభివృద్ధి కోసమే 2024 ఎన్నికల్లో తపనపడ్డాను
  • దేశం కోసం సెలవు తీసుకోకుండా కష్టపడుతున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి గురించి ఇష్టానుసారం మాట్లాడడం బాధించింది
  • మూడవసారి ప్రధానిగా శ్రీ మోదీ గారు దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకు వెళ్తున్నారు
  • శ్రీ మోదీ గారికి వెనుక బలంగా నిలబడదాం
  • భోగాపురంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘2024 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి కోసం నేను ఎందుకు తపనపడ్డానంటే దేశ అభివృద్ధికి బలమైన నాయకత్వం అవసరం. ఎర్ర బస్సు రాని చోటకు ఎయిర్ పోర్ట్ కడతారంట అంటూ అభివృద్ధిని అపహాస్యం చేసి, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన నాయకులకు గట్టిగా సమాధానం చెప్పాలనే కూటమిలో కచ్చితంగా మూడు పార్టీలు ఉండాలని తపనపడ్డాను. 2024 తర్వాత రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు, పలు పరిశ్రమలు రావడానికి ఇది ఓ దారి చూపింది. భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం రావడానికి కారణం అయ్యింది’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.
జాతి ఎవరికీ తల వంచదు.. ఈ గుండె దేనికి భయపడదు అని చాటి చెప్పిన మన్యం వీరుడు, మహనీయుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం గర్వంగా ఉందన్నారు. భోగాపురంలో నిర్మించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని ప్రసంగించారు. శనివారం ఉదయం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది నూతన అధ్యాయం. ఈ రోజు రూ. 17,435 కోట్ల అభివృద్ధి పనులు శ్రీ మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం కావడం గొప్ప విషయం. ఈ పనులు వల్ల రోడ్ల అనుసంధానం మరింత పెరిగుతుంది. ఎనర్జీ సెక్టార్లలో పరిశ్రమలకు అనువైన ఇంధన సరఫరా జరిగి యువతకు మరింతగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఒక దేశం ఎప్పుడూ ప్రకటనలతో అభివృద్ధి చెందదు. మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలను మరింత విస్తృతం చేయడం ద్వారా దేశం ప్రగతి ప్రయాణంలో ముందుకు సాగుతుంది.
గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్, ఆత్మ నిర్భర భారత్ ప్రణాళికల్లో భారత్ ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే గొప్ప దార్శనికత ఉంది. కచ్చితంగా చరిత్ర మనం నిర్మించే కట్టడాలను కాదు ఆ కట్టడాలతో నిర్మించే భవిష్యత్ ను గుర్తు ఉంచుకుంటుంది.
అభివృద్ధి బాటలు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో రూ. 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభం చేశారు. ఎన్టిపిసి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రూ. 50 వేల కోట్లతో అమరావతి పనులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులు రాష్ట్ర నిర్మాణానికి బలమైన పునాదులుగా నిలుస్తాయి. విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ద్వారా ప్రజల ఆకాంక్షలు తీరనున్నాయి.
దేశానికి నిస్వార్థంగా సేవ చేసిన వారిని గౌరవించాలి
పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు.. రాజకీయాల్లోకి వచ్చాక నన్ను కూడా చాలామంది అనరాని మాటలు అన్నారు. ఎన్నో నిందలు పడ్డాను. అయితే భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ఇష్టానుసారం కొందరు తూలనాడుతుంటే గుండె కదిలిపోయింది. భారతదేశం ఒకప్పుడు.. ఖజానా దగ్గర ఉన్న బంగారాన్ని విదేశాలకు తరలించి తాకట్టు పెట్టి, రోజువారీ కార్యకలాపాలు నిర్వర్తించే దుస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఈనాడు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా మన దేశం రూపొందడంలో మూడోసారి ప్రధానిగా తన బాధ్యతలను ఎంతో నిబద్దతగా నిర్వర్తిస్తున్న శ్రీ నరేంద్ర మోదీ గారిని అనరాని మాటలు అనడం బాధించింది. కన్నీళ్లు వచ్చాయి, బాధ పడ్డాను. దేశం కోసం నిస్వార్థం గా కష్టపడే వారికి ఇవా బహుమతులు అనిపించింది?
ఒక్క రోజు సెలవు తీసుకోని ప్రధాని
పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి శ్రీ మోదీ గారు. కొత్త తరం మోదీ గారు పడిన తపన, శ్రమ తెలుసుకోవాలి. భారతదేశానికి విదేశీ పెట్టుబడులు బలంగా వస్తున్నాయి. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో మన దగ్గర ఉన్నాయి. శత్రు దేశాలు మన అభివృద్ధిని చూసి ఈర్ష పడుతున్నాయి. ఒక పక్క దేశాన్ని ముందుకు నడిపిస్తూ, సరిహద్దుల వద్ద శత్రుదేశాలతో పోరాడాలి. అంతర్గత శత్రువులతోనూ పోరాటం చేయాలి. అలాంటి వ్యక్తికి మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే- మేమంతా మీ వెనుక ఉన్నాం.. దేశం కోసం మీతో కలిసి నడుస్తాం అనే భరోసాను గౌరవ ప్రధానికి మనం కల్పించాలి. మీ మీద మాట పడితే యావత్ భారతదేశం మీద మాట పడినట్లే అనే బలం ఇవ్వాలి. నేను సభా వేదిక సాక్షిగా చెబుతున్న… భారతదేశంలో శ్రీ నరేంద్ర మోదీ గారికి సాటిగల నాయకుడు మరొకరు లేరు. రారు రాబోరు. 144 కోట్ల భారతీయుల ఆకాంక్షలను ఆశలను బలంగా ముందుకు తీసుకు వెళ్తుంటే, ఎన్నో సవాళ్ళను ఆయన చిరు మందహాసంతోనే స్వీకరిస్తున్నారు.. వాటిని పరిష్కరిస్తున్నారు.
యువత దేశానికీ వనరు
25 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను చెప్పేది ఒక్కటే. పిల్లలకు సరైన సంస్కారం, సంప్రదాయం నేర్పడం మన బాధ్యత. వారిని దేశానికి ఉపయోగపడే గొప్ప వనరులుగా మార్చాల్సిన ప్రాథమిక బాధ్యత మనపైనే ఉంది. ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి వీడియో చూశాను. ఆయనను ఇష్టానుసారం తిట్టిన, తూలనాడిన యువతను సైతం పెద్ద మనసుతో ఆయన క్షమించడం గొప్ప విషయం. ఆయన స్వచ్ఛమైన మనసుకు వందనం. దేశాన్ని ముందుకు నడిపించడం అంటే రామకార్యం. హనుమంతుడు రామకార్యం నిమిత్తం లంకకు లంఘించినప్పుడు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నాడు. అలాంటిది 144 కోట్ల మంది భారతీయులను ముందుకు నడిపించడం అంటే సాధారణ విషయం కాదు. అది మహాకార్యం. అలాంటి మోదీ గారికి మనం ఎం ఇవ్వగలం..? ఆయనకు బలమైన మన విధేయత ఇవ్వాలి. ఆయన వద్దు అనుకున్న రోజు అధికారం పోవాలి తప్ప, అప్పటివరకు మోదీ గారే దేశాన్ని ముందుండి నడిపించాలని కోరుకొంటున్నాను” అన్నారు.

You may also like

Leave a Comment